ఆస్ట్రాజెనెకా టీకాతో మరో రుగ్మత.. గిలియన్-బ్యారీ సిండ్రోమ్‌ను గుర్తించిన నిపుణులు

  • టీకా వేయించుకున్న 10-22 రోజుల తర్వాత బాధితుల్లో కనిపిస్తున్న జీబీఎస్
  • కేరళలో ఏడు, బ్రిటన్‌లో నాలుగు కేసులు
  • రోగ నిరోధకశక్తి పొరపాటున సొంత నాడీవ్యవస్థపైనే దాడి చేస్తున్న వైనం
ఆస్ట్రాజెనెకా టీకాతో అరుదైన నాడీ సంబంధ సమస్య గిలియన్-బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) ఉత్పన్నమైనట్టు రెండు వేర్వేరు అధ్యయనాల్లో వెలుగుచూసింది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన ఈ టీకాను కేరళలోని ప్రాంతీయ వైద్యకేంద్రంలో వేయించుకున్న వారిలో ఏడుగురిలో, బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో నలుగురిలో జీబీఎస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.

టీకా వేయించుకున్న 10-22 రోజుల తర్వాత బాధితుల్లో ఈ లక్షణాలు కనిపించాయని, వారిలోని రోగ నిరోధకశక్తి పొరపాటున వారి నాడీవ్యవస్థపై దాడిచేయడమే ఇందుకు కారణమని తేలింది. దీని ప్రభావం ప్రధానంగా ముఖంపైనే కనిపిస్తున్నట్టు గుర్తించారు. అయితే, టీకా వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలతో పోలిస్తే తలెత్తే సమస్యలు చాలా స్వల్పమని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇదే టీకాను భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది.


More Telugu News