ఇప్పుడే పాఠశాలలను తెరవడమంటే వైరస్ విజృంభణకు అవకాశం ఇచ్చినట్టే: వీకే పాల్

  • విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది
  • పూర్తిస్థాయి రక్షణ కల్పించిన తర్వాతే తెరవాలి
  • పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్న విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని నిబంధనలతో పాఠశాలలు తిరిగి తెరవాలని కూడా ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే, ఈ నిర్ణయం సరికాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. కొవిడ్ పరిస్థితులను అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం ఏమంత మంచిది కాదని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుందని హెచ్చరించారు.

పాఠశాలలో టీచర్, హెల్పర్, విద్యార్థులు అందరూ ఒకే చోట ఉంటారని, ఫలితంగా వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. కాబట్టి ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించిన తర్వాతనో, లేదంటే వైరస్ దాదాపు కనుమరుగైన తర్వాతనో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో స్కూళ్లు తెరిచినప్పుడు కూడా వైరస్ విజృంభించిందని గుర్తు చేశారు.

ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలతోపాటు ప్రజలు క్రమశిక్షణగా ఉండడం వల్లే ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోందన్నారు. ఇప్పుడు మళ్లీ స్కూళ్లు ప్రారంభమైతే వైరస్‌ చెలరేగిపోవడానికి మళ్లీ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని వీకేపాల్ వివరించారు. కాబట్టి ఈ విషయంలో తొందరపాటు వద్దని హెచ్చరించారు. పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్న నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, రెండు మూడు మంత్రిత్వశాఖలు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకుంటాయని పాల్ పేర్కొన్నారు.


More Telugu News