సెప్టెంబరు నాటికి పిల్లలకు కరోనా టీకా: ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా

  • అప్పటికల్లా కొవాగ్జిన్‌ 2,3 దశల ప్రయోగ ఫలితాలు
  • వినియోగానికి వెంటనే అనుమతి లభించే అవకాశం
  • పిల్లలపై కొనసాగుతున్న కొవాగ్జిన్‌ ప్రయోగాలు
  • ఫైజర్‌ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం
సెప్టెంబరు నాటికి రెండేళ్ల పైబడిన పిల్లలందరికీ కరోనా టీకా కొవాగ్జిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుతం పిల్లలపై జరుగుతున్న కొవాగ్జిన్ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ రెండు, మూడో దశ ప్రయోగ ఫలితాలు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫలితాలు సానుకూలంగా ఉంటే అదే నెలలో అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు.

అలాగే భారత్‌లో ఫైజర్ టీకాకు అనుమతి లభిస్తే అది కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గులేరియా తెలిపారు. ఇప్పటికే ఈ టీకాను 2-17 ఏళ్ల పిల్లలపై ప్రయోగాలను దిల్లీ ఎయిమ్స్‌ జూన్‌ 7న ప్రారంభించింది.

ఇక పాఠశాలల పునఃప్రారంభంపై స్పందిస్తూ.. విద్యా సంస్థలు వైరస్ ప్రజ్వలన కేంద్రాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం సమగ్ర విధానాలు రూపొందించాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో లేని పాఠశాలలు పిల్లల్ని రోజుమార్చి రోజు పిలవడం, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా పాటించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు.


More Telugu News