ఒక్క బ‌ట‌న్ నొక్కి 23,14,342 మంది మ‌హిళ‌ల‌ ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు వేసిన సీఎం జ‌గ‌న్!

  • వైఎస్సార్‌ చేయూత ప‌థ‌కం ప్రారంభం
  • 45-60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ల‌బ్ధి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు పథకం
  • ఏడాదికి రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం  
  • మ‌హిళా సాధికార‌త‌కూ కృషి: జ‌గ‌న్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కంప్యూటర్ బ‌ట‌న్ నొక్కి 23,14,342 మంది ఖాతాల్లో వైఎస్సార్‌ చేయూత ప‌థ‌కం కింద మొత్తం రూ.4,339.39 కోట్లు జమ చేశారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందుతోన్న విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని త‌న క్యాంప్ ఆఫీసు నుంచి జ‌గ‌న్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి మహిళకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తామ‌ని, అర్హత ఉండి రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయ‌న చెప్పారు. వెంట‌నే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.  

మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ఈ పథకాన్ని చేపట్టామ‌ని ఆయ‌న అన్నారు.   రెండేళ్లలోనే వైఎస్సార్‌ చేయూత ద్వారా మహిళలకు దాదాపు మొత్తం రూ.9 వేల కోట్ల ఆర్థిక సాయం అందించామ‌ని తెలిపారు. మ‌హిళా సాధికార‌త కోసం కృషి చేస్తున్నామ‌ని,  అమూల్‌, రిలయన్స్‌, పీ అండ్‌ జీ, ఐటీసీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.  

78 వేల మంది మ‌హిళ‌లు కిరాణా షాపులు పెట్టుకోగలిగారని జగన్‌ తెలిపారు. దాదాపు లక్షా 19 వేల మంది మహిళలు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారన్నారు. లీటర్‌ పాలకు అదనంగా రూ.15 వరకు లబ్ధి జరిగేలా కార్యాచరణ చేపట్టామని చెప్పారు.

కంపెనీలు, బ్యాంకులతో లబ్ధిదారుల అనుసంధానంపై కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.  రాష్ట్రంలో కేబినెట్‌లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు నామినేటెడ్‌ పదవులను కేటాయించామని, ప్రతి రంగంలోనూ అధిక శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు.  గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించామని తెలిపారు.  


More Telugu News