తాడేపల్లి అత్యాచార ఘటన.. బాధిత యువతికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటన

  • బాధితురాలిని పరామర్శించిన మంత్రులు వనిత, సుచరిత
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ. 50 వేల పరిహారం
  • కఠిన చట్టాలు అమల్లో ఉన్నా ఇలాంటి నేరాలు జరగడం బాధాకరమన్న హోం మంత్రి
  • ఘటన జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు 5 నేరాలు
తాడేపల్లి అత్యాచార బాధితురాలికి ఏపీ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, సుచరిత నిన్న బాధిత యువతిని పరామర్శించారు. అనంతరం వనిత మాట్లాడుతూ.. తాడేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే రూ. 5 లక్షలతోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి రూ. 50 వేలు అందిస్తామన్నారు.

ఇద్దరు నిందితులే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారని పేర్కొన్న మంత్రి.. యువతి కాబోయే భర్తపై దుండగులు దాడిచేసి ఆభరణాలు కూడా లాక్కెళ్లిపోయారని చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా 50 శాతం ఆధారాలను సేకరించినట్టు మంత్రి వనిత చెప్పారు.

కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. వీలైనంత త్వరగా నిందితులకు సంకెళ్లు వేస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమన్నారు. తాడేపల్లి ఘటన జరిగిన ప్రాంతంలో ఇప్పటి వరకు 5 నేరాలు జరిగాయని, భవిష్యత్తులో జరగకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిందితులు బ్లేడుతో బాధితులను బెదిరించి వారి సెల్‌ఫోన్లు లాక్కున్నట్టు మంత్రి తెలిపారు.


More Telugu News