వీడియో కాల్‌లో కాదు.. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కే రండి!

  • ట్విట్టర్‌పై యూపీ పోలీసుల కేసు
  • వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌ ఇండియా ఎండీకి నోటీసులు
  • వీడియో కాల్‌లో అందుబాటులోకి వచ్చిన ఎండీ
  • కుదరదన్న యూపీ పోలీసులు
  • గురువారం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని మళ్లీ నోటీసులు
విద్వేషాలు రెచ్చగొట్టే వీడియోను ఓ యూజర్‌ పోస్ట్‌ చేయడంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ట్విట్టర్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌ ఇండియా ఎండీ మనీష్‌ మహేశ్వరిని పోలీసులు ఆదేశించారు. నేడు ఆయన వీడియో కాల్‌లో విచారణకు అందుబాటులోకి రావడాన్ని పోలీసులు అంగీకరించలేదు. గురువారం పోలీస్‌ స్టేషన్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పారు.

అలాగే ఎండీతో పాటు ట్విట్టర్‌ ఇండియా రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ధర్మేంద్ర చతుర్‌ కూడా విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు. వీరిరువురే ట్విట్టర్ కార్యకలాపాలకు బాధ్యులని తెలిపారు. అధికారులు కోరినప్పటికీ.. వీడియోను తొలగించేందుకు ట్విట్టర్‌ నిరాకరించిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను అమలు చేయడంలో ట్విట్టర్‌ జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో మధ్యవర్తిత్వ హోదాలో దానికి ఉన్న రక్షణ కవచాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ట్విట్టర్‌లో పోస్ట్‌ అయ్యే ప్రతి సందేశానికి ఆ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవసరమైతే భారత చట్టాలకు అనుగుణంగా శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.


More Telugu News