కరోనా నుంచి కోలుకున్న కొన్ని రోజులకే ఎవరెస్ట్​ ను అధిరోహించిన 25 ఏళ్ల యువకుడు!

  • 65 రోజుల సాహసయాత్ర
  • తొలి ప్రయత్నంలో గెలుపు
  • ఎక్కుతుండగా బేస్ క్యాంప్ వద్ద కరోనా
  • అక్కడే ఉండి చికిత్స
  • ఆ వెంటనే జర్నీ మొదలు
కరోనా నుంచి కోలుకున్నాక కూడా ఎన్నెన్నో సమస్యలు వేధిస్తున్నాయిప్పుడు. చాలా మంది కరోనా అనంతర సమస్యలతోనే చనిపోతున్నారు. అయితే, మహారాష్ట్రలోని వాసాయికి చెందిన 25 ఏళ్ల హర్షవర్ధన్ జోషి మాత్రం.. మహమ్మారి నుంచి కోలుకున్న కొన్నిరోజులకే సాహసయాత్ర మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరం ఎవరెస్ట్ ను ఎక్కేశాడు.

అంతేకాదు.. తన పర్వతారోహణలో మరో స్పెషాలిటీ కూడా ఉంది. హర్షవర్ధన్ సాహసయాత్ర పర్యావరణ హితంగా సాగింది. ‘సంఘర్ష్ (SangHarsh)’ పేరిట చేసిన యాత్రలో ఆదిలోనే అతడికి కష్టాలు మొదలయ్యాయి. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఉన్న హర్షవర్ధన్ ఐదేళ్ల పాటు ఎవరెస్ట్ అధిరోహణపై శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు కేవలం 65 రోజుల్లోనే శిఖరం ఎక్కాడు. మే 23న ఫీట్ ను సాధించాడు. తాజాగా ఆ వివరాలను అతడు వెల్లడించాడు.

ఆదిలోనే ఆటంకాలు...

హర్షవర్ధన్ అధిరోహణ ప్రారంభించే సమయానికి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద కరోనా కేసులు వచ్చాయి. తన సహచర పర్వతారోహకులు దగ్గుతూ, తుమ్ముతూ నీరసించి పోయారు. అయితే, కరోనా భయాల నేపథ్యంలో అందరినీ దూరంగా ఉంచారు. మహమ్మారి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని హర్ష చెప్పాడు. ఏ టీమ్ కు ఆ టీమ్ సెపరేట్ బబుల్ లో ఉందన్నాడు. అయితే, బేస్ క్యాంప్ లో ఎవరికి వైరస్ సోకిందన్నది మాత్రం ఎవరికీ తెలియదన్నాడు. మామూలుగా అయితే, ఖుంబు వద్ద అతి చల్లటి వాతావరణానికి అందరికీ దగ్గు కామన్ గా వస్తుందన్నాడు. బేస్ క్యాంప్ వద్ద కనీసం కరోనా టెస్టింగ్ సౌకర్యం కూడా లేదన్నాడు.

ఎవరెస్ట్ మీదనే పాజిటివ్...

ఈ క్రమంలోనే డాక్టర్ గా పనిచేస్తున్న టీమ్ లోని ఓ సభ్యుడి భార్య యాంటీ జెన్ టెస్ట్ కిట్లను తీసుకొచ్చి టెస్టులు చేసిందని హర్ష చెప్పుకొచ్చాడు. తుది అంకానికి సిద్ధమవుతున్న తరుణంలోనే మే 8న తనకూ పాజిటివ్ వచ్చిందని, దీంతో గుండె బద్దలైందని చెప్పాడు. కొందరు వైద్యులు అధిరోహణ మానేయాలని సలహా ఇచ్చారన్నాడు. అయితే, ఇంతకుముందే మహమ్మారితో ఓ సారి రద్దయిపోయిన ఎవరెస్ట్ అధిరోహణను ఈ సారి వదిలేయడానికి రెడీగా లేనని చెప్పాడు. అలాగే నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. దాంతో పాటే తన ఆర్థిక స్థితిగతుల గురించి కూడా బేరీజు వేసుకున్నాడు. దీని కోసం అప్పటికే రూ.60 లక్షలు ఖర్చవుతున్న నేపథ్యంలో.. మళ్లీ స్పాన్సర్ దొరకాలంటే కష్టమని భావించాడు.

కరోనా వచ్చిన వెంటనే అక్కడే ఐసోలేట్ అయ్యానని, ఆరోగ్యం క్షీణించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాడు. తన టీమ్ లో ఎక్స్ ట్రా ఆక్సిజన్, హెలికాప్టర్, డాక్టర్ సహా అన్నీ ఉండడంతో మనో నిబ్బరాన్ని కూడగట్టుకుని అక్కడే ఉండిపోయాడు. దాంతో పాటు ముందే వ్యాక్సిన్ వేసుకోవడమూ కలిసొచ్చింది. కొన్ని రోజులకే కరోనా తగ్గిపోయింది. కరోనా విజృంభించే చల్లటి వాతావరణంలోనూ తాను బతికానంటే దానికి కారణం వ్యాక్సిన్ ప్రభావమేనని హర్షవర్ధన్ అన్నాడు.

అంతేకాదు.. కరోనా వచ్చిందని అతడు పూర్తిగా కూడా రెస్ట్ తీసుకోలేదు. తుది అంకానికి చేరేందుకు రిహార్సల్స్ కూడా చేశాడు. దగ్గర్లో ఉన్న చిన్నాచితకా శిఖరాలను అధిరోహించాడు. తర్వాత టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రాగానే మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాడు. మే 23న శిఖరాన్ని అధిరోహించాడు.

తిరుగు ప్రయాణంలో కష్టాలు...

ఎక్కడం ఒకెత్తయితే.. దిగడమే అతిపెద్ద సవాల్ అంటాడు హర్ష. శిఖరాన్ని అధిరోహించాక వాతావరణం బాగా లేకపోవడంతో ఐదు నిమిషాలకు మించి అక్కడ ఉండలేదు. వెంటనే తిరుగు ప్రయాణం మొదలుపెట్టేశాడు. కానీ, అప్పటికే కొన్ని రోజుల ముందే ఓ పర్వతారోహకుడు ఎవరెస్ట్ నుంచి దిగుతూ లోయలో పడిపోయిన విషయం హర్షకు గుర్తొచ్చిందట. అంతేకాదు.. పరిస్థితులు మరింత దిగజారి దాదాపు ఐదు రోజుల పాటు క్యాంప్ 2లో ఒంటరిగా కాలం వెళ్లదీశాడట. తన కూడా వచ్చిన షెర్పా ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లతో క్యాంప్ 1కు వెళ్లిపోయాడు. తన ఫోన్ లో ఉన్న 20 పాటలతో ధైర్యం కూడదీసుకున్నాడు. చివరకు కష్టాలు పడి మే 29న బేస్ క్యాంప్ వరకు వచ్చేశాడు. తన ప్రయాణంలో పునరుత్పాదక ఇంధనం వాడాలన్న సందేశాన్నిస్తూ తన వెంట సౌర ఫలకలను తీసుకెళ్లాడు. వెచ్చదనం కోసం వాటితోనే కరెంట్ ను పుట్టించి చలి కాచుకున్నాడు.


More Telugu News