మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నాలు: స‌ంజ‌య్ రౌత్

  • మ‌హారాష్ట్ర‌లోని మ‌హా వికాస్ అఘాడీ ఐకమ‌త్యంతో ఉంది
  • ప్ర‌భుత్వం  పూర్తిగా ఐదేళ్లు కొన‌సాగుతుంది
  • బీజేపీ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతాయి
మ‌హారాష్ట్ర‌లోని మ‌హా వికాస్ అఘాడీ ఐకమ‌త్యంతో ఉంద‌ని, సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొన‌సాగుతుంద‌ని శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ అన్నారు. ఆ కూట‌మిలో  కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ భ‌విష్య‌త్తులో ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని  రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. అలాగే, ఆ కూట‌మికి బీట‌లు ప‌డుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై సంజ‌య్ రౌత్ స్పందించారు.

'మ‌హా వికాస్ అఘాడీలోని శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ.. ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రేకు పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఆ పార్టీల‌న్నీ క‌లిసే ఉన్నాయి.. భ‌విష్యత్తులోనూ  ఐకమ‌త్యంతో ఉంటాయి. పూర్తిగా ఐదేళ్ల పాటు ప్ర‌భుత్వాన్ని కొన‌సాగించాల‌ని నిబ‌ద్ధ‌త‌తో ఉన్నాము' అని సంజ‌య్ తెలిపారు.

'మ‌హారాష్ట్ర‌లో అధికారాన్ని కోల్పోయినందుకు బ‌య‌టి వ్య‌క్తులు (బీజేపీ నేత‌లు) కుదురుగా ఉండ‌లేక‌పోతున్నారు... రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ వారి ప్ర‌య‌త్నాల‌ను ప్రభావితం కాకుండా మా కూట‌మి కొన‌సాగుతుంది' అని సంజ‌య్ తెలిపారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు శివసేన నేతల్ని వేధిస్తున్నాయని నాయకుల్ని కాపాడేందుకు బీజేపీతో మ‌ళ్లీ క‌లుద్దామ‌ని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్ లేఖ రాయ‌డం ప‌ట్ల సంజ‌య్ రౌత్ స్పందించారు. ఇది స‌ర్నాయ‌క్ అభిప్రాయం మాత్ర‌మేన‌ని, అంద‌రితోనూ చ‌ర్చించి, పార్టీ వ్య‌హారాల‌ను నిర్ణ‌యించాల్సింది ఉద్ధ‌వ్ థాక‌రేనే నని అన్నారు. యోగా డే గురించి స్పందిస్తూ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు శ‌వాస‌నం వేయాల‌ని ఆయ‌న చుర‌క‌లంటించారు.


More Telugu News