ఇంతకీ రాహుల్ గాంధీ వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదా?: కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ చుర‌క‌లు

  • ఇప్ప‌టికే వ్యాక్సిన్ వేయించుకున్న సోనియా గాంధీ
  • ఆల‌స్యంగా వెల్లడించిన కాంగ్రెస్‌
  • రాహుల్ కూడా వేయించుకోవాల‌న్న ర‌విశంక‌ర్
  • విన‌య‌పూర్వ‌కంగా కోరుతున్నానని సెటైర్లు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవిషీల్డ్ రెండో డోసు, ప్రియాంక గాంధీ తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నార‌ని ఇటీవ‌ల కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. వారు టీకాను ఎందుకు రహస్యంగా వేసుకున్నారని బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  వ్యాక్సిన్ పై కాంగ్రెస్  పార్టీ మొద‌ట్లో తప్పుడు ప్రచారం చేసింద‌ని గుర్తు చేస్తున్నారు. ఈ విష‌యంపై కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కూడా స్పందిస్తూ సెటైర్లు వేయ‌డం గ‌మ‌నార్హం.

బీహార్ రాజ‌ధాని పాట్నాలో ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంతకీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాక్సిన్ వేయించుకున్నారా?  లేదా? అన్న విష‌యం దేశ ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికీ తెలియ‌దు. ఇప్ప‌టికీ ఆయ‌న వ్యాక్సిన్ వేయించుకోకపోతే మాత్రం వేయించుకోవాల‌ని నేను విన‌య‌పూర్వ‌కంగా ఆయ‌న‌ను కోరుతున్నాను' అని వ్యాఖ్యానించారు.

వ్యాక్సినేష‌న్ పట్ల ప్ర‌తిప‌క్ష నేత‌ల తీరుపై బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా స్పందించారు. 'కొవిడ్ 19 వ్యాక్సిన్ పై మొద‌ట్లో చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు అనేక ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ఇప్పుడు మాత్రం దీనిపై వారు త‌మ తీరును మార్చుకోవ‌డానికి కార‌ణం ఏంటీ?' అని జేపీ న‌డ్డా ప్ర‌శ్నించారు.


More Telugu News