ప్రొ.జ‌య‌శంక‌ర్‌కు ప్ర‌ముఖుల నివాళులు

  • నేడు జ‌య‌శంక‌ర్ వ‌ర్ధంతి
  • తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు: కేసీఆర్
  • చిన్నతనం నుంచే అన్యాయాన్ని ప్రశ్నించారు: కోమటిరెడ్డి
  • ఆయ‌న‌ మహోన్నత ఉద్యమ శిఖరం: ఈట‌ల‌
తెలంగాణ ఉద్య‌మ‌కారుడు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతోందని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీ  పడుతూ, నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి అర్పిస్తున్నదని సీఎం తెలిపారు.

స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాత, ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము అని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు.

'తన చిన్నతనం నుంచే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి యావత్ తెలంగాణ సమాజాన్ని మేలుకొలిపిన ప్రొ. జయశంకర్ సర్ లేకపోవడం దురదృష్టకరం. వీరు ఉండి ఉంటే కేసీఆర్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని, జరుగుతున్న మోసాన్ని ప్రశ్నించే గొంతుక అయ్యే వారు' అని కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అన్నారు.

జ‌య‌శంక‌ర్‌కు తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల నివాళులు అర్పించారు. 'ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం... తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు' అని ఆయ‌న ట్వీట్ చేశారు.

'తెలంగాణ ఉద్యమం కోసం తుది శ్వాసవరకు తపించి పోరాడిన ప్రొఫెసర్ కే జయశంకర్ గారు తెలంగాణ విజయబావుటా మీద చిరస్థాయిగా నిలిచిపోతారు' అని బీజేపీ నేత రామ‌చంద‌ర్ రావు అన్నారు. 'తెలంగాణ జాతిపిత, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఇవే మా అశ్రు నివాళులు' అని వైఎస్ ష‌ర్మిల ట్వీట్ చేశారు.


More Telugu News