పాముకి ఊపిరూది ప్రాణం పోసిన యువకుడు!

  • ఒడిశాలో ఘటన
  • ఎలుక వేటలో కన్నంలో ఇరుక్కున్న పాము
  • కాసేపటికి అపస్మారక స్థితిలోకి
  • స్నేక్‌ క్యాచర్‌ స్నేహాశీష్‌ సాహసం
  • పాముని బయటకు తీసి స్ట్రాతో ఊపిరి
  • 15 నిమిషాల తర్వాత కోలుకున్న పాము
  • అడవిలో వదిలిపెట్టిన వైనం
సాధారణంగా ఎవరైనా శ్వాస అందక కొట్టుమిట్టాడుతుంటే చూసి జాలి పడతాం. కొంచెం జాలి గుండె కలవారైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక కాస్త అవగాహన ఉండి, మనసున్న వారైతే వెంటనే నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊది ప్రాణం పోసే ప్రయత్నం చేస్తారు.

మరి ఒక పాము ఊపిరి అందక కొట్టుమిట్టాడుతుంటే ఏం చేస్తాం. సాధారణంగానైతే పాముని చూడగానే అది ఏ స్థితిలో ఉందో కూడా పట్టించుకోం. వెంటనే దానికి ఆమడ దూరం పరుగెడతాం. కానీ, మనుషుల వలే దాన్ని కూడా దగ్గరకు తీసుకొని నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊదే సాహనం ఎవరైనా చేస్తారా? అసలు ఊహకు కూడా అందడం లేదు కదా?

కానీ, ఒడిశాలో జరిగిన ఈ సంఘటన చూస్తే మనకు ఆశ్చర్యం కలగకమానదు. మల్కన్‌గిరి జిల్లాకు చెందిన స్నేహాశీష్‌ అనే వ్యక్తి స్థానికంగా పాములను పట్టుకుంటుంటాడు. ఎలుకను వేటాడుతూ ఓ ఇంట్లోకి దూరిన పాము ఓ కన్నంలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేహాశీష్‌ వెంటనే అక్కడికి చేరుకొని ఆ 10 అడుగుల పామును బయటకు తీశాడు. కానీ, అది అప్పటికే అపస్మార స్థితిలోకి వెళ్లడం గమనించాడు. ఊపిరి ఊదాలని తలచాడు. చుట్టుపక్కల చూడగా.. ఓ స్ట్రా కనపడింది. వెంటనే దాన్ని పాము నోట్లో పెట్టి ఊపిరి ఊదాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత అది స్పృహలోకి వచ్చింది.

ఆ పాముకు ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాముకి ప్రాణం పోసిన స్నేహాశీష్‌పై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.


More Telugu News