యూపీలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉంది: రాష్ట్ర లా కమిషన్‌ ఛైర్మన్‌

  • జనాభా పెరుగుదల వల్ల సమస్యలు
  • వెంటనే నియంత్రించాలని ఆదిత్యనాథ్‌ మిట్టల్‌ ప్రతిపాదన
  • ఇది ఏ మతానికీ వ్యతిరేకం కాదని వ్యాఖ్య
  • జనాభా నియంత్రణకు సహకరిస్తున్న వారికి ప్రభుత్వ ప్రయోజనాలు
  • అసోంలో ఇద్దరు పిల్లల విధానం అమలుకు సీఎం యోచన
ఉత్తరప్రదేశ్‌లో జనాభా పెరుగుదల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని.. దీనిపై నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ర లా కమిషన్‌ ఛైర్మన్‌ ఆదిత్యనాథ్‌ మిట్టల్‌ అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణకు సహకరిస్తున్న వారికి, సహాయపడుతున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు అందాల్సిన అవసరం ఉందన్నారు.

జనాభా అదుపు చేయడానికి, కుటుంబ నియంత్రణకు మధ్య తేడా ఉందని మిట్టల్‌ అభిప్రాయపడ్డారు. జనాభా అదుపు అనేది ఏ మతానికీ వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆ రాష్ట్రంలో జనాభా నియంత్రణ విధానాన్ని ప్రతిపాదించిన ఒక్క రోజు వ్యవధిలోనే మిట్టల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, జనాభా నియంత్రణకు సంబంధించి చట్టం తీసుకొస్తున్నట్లు ఇప్పటి వరకు యూపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.

‘ఇద్దరు పిల్లల’ విధానాన్ని తమ ప్రభుత్వం క్రమంగా అమల్లోకి తీసుకురానుందని.. అటువంటి వారికి ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించనున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, టీ గార్డెన్‌ వర్కర్లకు దీని నుంచి మినహాయింపునిస్తామని పేర్కొన్నారు.


More Telugu News