ఢిల్లీలో ఓ డాక్టర్ నివాసంలో వేల సంఖ్యలో నకిలీ 'బ్లాక్ ఫంగస్' ఇంజెక్షన్లు

  • దేశంలో అధికసంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు
  • చికిత్సలో కీలకంగా యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్
  • ఢిల్లీలో అక్రమ తయారీ ముఠా గుట్టురట్టు
  • ముఠాలో ఇద్దరు డాక్టర్లు
దేశంలో ఓవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాంతో కొందరు అక్రమ ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు తెరలేపారు. ఢిల్లీలో అక్రమంగా లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు తయారుచేస్తున్న 10 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఇద్దరు డాక్టర్లు ఉండడం నివ్వెరపరుస్తోంది.

అంతేకాదు, ఈ ఇద్దరిలో ఒకరైన డాక్టర్ అల్తమాస్ హుస్సేన్ నివాసంలో 3,293 నకిలీ ఇంజెక్షన్లను గుర్తించారు. వాటిలో అత్యధికంగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించేవాటికి నకిలీలని పోలీసులు తెలిపారు. తమ దాడిలో రెమ్ డెసివిర్ నకిలీ ఔషధాలు లభించాయని, కొన్ని కాలపరిమితి దాటిపోయిన మందులు కూడా లభ్యమయ్యాయని వివరించారు. ఈ కేసు తీవ్రత నేపథ్యంలో, పోలీసులు ఆ ఇద్దరు వైద్యులు విద్యార్హతలను పరిశీలించే పనిలో పడ్డారు.

ఈ నెల 7న ఢిల్లీలో నకిలీ ఇంజెక్షన్ల దందాపై ఢిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దాడులు చేశారు. ఇప్పటివరకు ఈ ముఠా 400కి పైగా నకిలీ ఇంజెక్షన్ల అమ్మకాలు సాగించిందని, ఒక్కొక్కటి రూ.250 నుంచి రూ.12 వేల వరకు అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది.


More Telugu News