అవసరమున్నవే తెరవాలి.. లేదంటే మూడో వేవ్​ ముప్పును కొని తెచ్చుకున్నట్టే: సీఐఐ అధ్యక్షుడు

  • సామాజిక కార్యక్రమాలు ఇప్పుడే వద్దు
  • ఏప్రిల్, మే నెలలో ఆర్థిక వ్యవస్థ పట్టుతప్పింది
  • జీఎస్టీ వసూళ్లు తగ్గడమే నిదర్శనం
దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉండాలంటే.. ప్రభుత్వాలు జాగ్రత్తగా లాక్ డౌన్ ను ఎత్తేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) నూతన అధ్యక్షుడు టి.వి. నరేంద్రన్ అన్నారు. అవసరమున్న వాటినే తెరవాలని ఆయన సూచించారు. లేదంటే మూడో వేవ్ ముప్పును కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు.

‘‘ఒకేసారి అన్నింటినీ ఓపెన్ చేయడం సరికాదు. ఏవి అవసరమో.. ఏవి అవసరం లేదో ఓ జాబితా సిద్ధం చేసుకోవాలి. అందుకు తగ్గట్టు అవసరమున్న వాటిని ఓపెన్ చేసి.. మిగతా వాటిని మూసే ఉంచడం మంచిది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే కార్యకలాపాలను మాత్రం ఇప్పుడు ప్రారంభిస్తే చాలు. సామాజిక కార్యక్రమాల ప్రారంభానికి మరికొన్ని నెలలు ఆగినా ఫర్వాలేదు. అలాగైతేనే థర్డ్ వేవ్  ముప్పును తగ్గించగలుగుతాం’’ అని ఆయన అన్నారు.

ఏప్రిల్, మేలో ఆర్థిక కార్యకలాపాలు చాలా వరకు తగ్గిపోయాయన్నారు. స్థానిక లాక్ డౌన్ ల వల్ల చాలా మందిపై ప్రభావం పడిందన్నారు. దాని వల్ల జీఎస్టీ వసూళ్లూ తగ్గాయన్నారు. గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ.. సెకండ్ వేవ్ తో మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. ఇప్పటి నుంచి డిసెంబర్ దాకా రోజూ సగటున 71.2 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తేనే మొత్తం పెద్దవారందరికీ టీకా వేయగలుగుతామన్నారు. అప్పుడే ముప్పు నుంచి బయట పడవచ్చన్నారు.


More Telugu News