ఏ వయసు వారికైనా సోకుతున్న కరోనా డెల్టా వేరియంట్

  • తీవ్ర ప్రభావం చూపుతున్న బి.1.617.2 వేరియంట్
  • ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రభావం
  • అత్యధికంగా 20-30 ఏళ్ల వారిలో వ్యాప్తి
  • పసికందుల్లోనూ ఈ వేరియంట్ ప్రభావం
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వేరియంట్ బి.1.617.2. దీన్నే నిపుణులు డెల్టా వేరియంట్ అని పిలుస్తున్నారు. సెకండ్ వేవ్ లో అత్యధిక శాతం కేసులు ఈ వేరియంట్ కారణంగానే అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ బి.1.617.2 డెల్టా వేరియంట్ ప్రత్యేకించి ఓ వయసు వారికే అన్న తేడా లేకుండా, అన్ని వయసుల వారికి సోకుతున్నట్టు గుర్తించారు.

పసికందుల నుంచి 80 ఏళ్లకు పైబడినవారి వరకు ఈ వేరియంట్ బారినపడుతున్నారట. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా ఇది ప్రభావం చూపిస్తోందట. అయితే, మహిళల కంటే పురుషుల్లోనే కాస్త ఎక్కువమందికి సోకుతున్నట్టు వెల్లడైంది.

డెల్టా వేరియంట్ వ్యాప్తి తీరుతెన్నులు పరిశీలిస్తే... 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారికి అధికంగా సోకుతోందని ఇంగ్లండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ తర్వాత స్థానంలో పిల్లలు, టీనేజర్లు, 30 నుంచి 39 ఏళ్ల వయసు వారు ఉన్నారు. ఇంగ్లండ్ ఆరోగ్య శాఖకు చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ పరిశోధక సంస్థ భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తిని విశ్లేషిస్తోంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... డెల్టా వేరియంట్ జన్యు ఉత్పరివర్తనాలకు లోనై ఇటీవలే డెల్టా ప్లస్ (ఏవై1)గా కొత్త రూపు దాల్చింది. ఇప్పుడు మరో మ్యూటేషన్ కు గురై ఏవై2గా అవతారం మార్చుకున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కరోనా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ ఈ మేరకు మార్పు చెందినట్టు తెలుసుకున్నారు.


More Telugu News