కరోనాతో మరణించిన వారికి పరిహారం ఇవ్వలేం: సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పిన కేంద్రం

  • విపత్తు నిర్వహణ నిధులూ చాలవు
  • రాష్ట్రాల ఖజానాకు భారం అవుతుంది
  • వేరే విపత్తులొస్తే నిధులుండవు
కరోనాతో చనిపోయిన వారందరికీ పరిహారం చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలా చేస్తే విపత్తు ఉపశమన నిధులూ సరిపోవని పేర్కొంది. కొవిడ్ కల్లోల ఉపశమనానికి కనీస ప్రమాణాలు పాటించాలని, కరోనాతో మరణించిన వారికి పరిహారం చెల్లించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా.. అఫిడవిట్ ను దాఖలు చేసింది.

‘‘కొవిడ్ తో చనిపోయినవారికి రూ.4 లక్షల పరిహారాన్ని చెల్లించలేం. భూకంపాలు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల వల్ల నష్టం సంభవిస్తేనే పరిహారం చెల్లించాలని విపత్తు నిర్వహణ చట్టంలో స్పష్టంగా ఉంది’’ అని పేర్కొంది. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.4 లక్షల చొప్పున ఇస్తూ పోతే విపత్తు నిధులు మొత్తం దీనికే పోతాయని, అవీ చాలవని తెలిపింది.

రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులను మొత్తం దానికే ఖర్చు చేస్తే.. రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ ఏర్పాట్లకు నిధులుండవని చెప్పింది. అంతేగాకుండా తుఫాన్లు, వరదల వంటివి వచ్చినప్పుడు వాటి కోసమూ నిధులు కావాల్సి ఉంటుందని కోర్టుకు చెప్పింది. కాబట్టి.. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ పరిహారం ఇవ్వాలంటే.. రాష్ట్రాల ఖజానాకు మించిన భారమవుతుందని పేర్కొంది.

బాధితుల బీమా చెల్లింపులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు దరఖాస్తులను ఇన్సూరెన్స్ సంస్థలకు పంపించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బీమా సంస్థలకు రూ.442.4 కోట్ల నిధులను విడుదల చేశామంది. 2019–2020లోనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1,113.2 కోట్ల అదనపు నిధులను విడుదల చేశామని వివరించింది. మొత్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్ నెస్ ప్యాకేజ్ కింద ఇప్పటిదాకా రూ.8,257.89 కోట్ల నిధులను ఇచ్చామని కేంద్రం వెల్లడించింది.


More Telugu News