కరోనా థర్డ్​ వేవ్​ అనివార్యం: తేల్చి చెప్పిన ఎయిమ్స్​ చీఫ్​

  • 6 నుంచి 8 వారాల్లో వస్తుందన్న రణ్ దీప్ గులేరియా
  • ఫస్ట్, సెకండ్ వేవ్ నుంచి జనం ఇంకా నేర్చుకోలేదు
  • కరోనా రూల్స్ పాటించట్లేదు
  • వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ మంచిదే
  • వీలైనంత ఎక్కువ మందికి టీకాలేయొచ్చు
దేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని, ఆరు నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ వస్తుందని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధిపతి డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించాక ప్రజలెవరూ నిబంధనలను పాటించట్లేదన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి ప్రజలెవరూ ఇంకా గుణపాఠం నేర్చుకోనట్టున్నారన్నారు. ఇప్పుడు కూడా జనం గుమికూడుతున్నారని, భౌతిక దూరం, మాస్క్ వంటి నిబంధనలేవీ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంపైనే థర్డ్ వేవ్ ఆధారపడి ఉందన్నారు.

మూడో వేవ్ వస్తే మూడు నెలల పాటు ఉంటుందన్నారు. పాజటివ్ కేసులు 5 శాతం దాటితే వెంటనే మినీ లాక్ డౌన్లు పెట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్ వేగం పుంజుకోకుంటే ముప్పు ఎక్కువ అవుతుందన్నారు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం చెడ్డ నిర్ణయమేమీ కాదని, అదీ మంచిదేనని అన్నారు. దాని వల్ల వీలైనంత ఎక్కువ మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా వేయడానికి అవకాశం దొరుకుతుందన్నారు.

డెల్టా వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై మాట్లాడుతూ కరోనా మ్యుటేషన్లపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కొత్త విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిపై వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేయాలన్నారు.


More Telugu News