భారత్‌ను ఆదుకుంటామని విరాళాలు సేకరించి.. ఉగ్రసంస్థల చేతుల్లో పోసిన పాక్ స్వచ్ఛంద సంస్థలు!

  • అమెరికాలోని పాక్ స్వచ్ఛంద సంస్థల నిర్వాకం
  • ఏప్రిల్ 27, 28 తేదీల్లో విరాళాల సేకరణ
  • మొత్తం రూ. 150 కోట్లు సేకరించి మత ఛాందసవాదులు, పాక్ సైన్యానికి సమర్పణ
  • రూ. 30 కోట్లతో భారత్‌కు సాయం చేసినట్టు ప్రకటన
  • తమకు సాయం అందలేదని భారత్ స్పష్టీకరణ
కరోనా సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకుంటామంటూ అమెరికాలోని పాకిస్థాన్ స్వచ్ఛంద సంస్థలు భారీ కుంభకోణానికి తెరలేపాయి. ‘హెల్పింగ్ ఇండియా బ్రీత్’ పేరుతో లక్షలాది డాలర్లను విరాళాలుగా సేకరించిన ఈ సంస్థలు వాటన్నింటినీ తీసుకెళ్లి ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యం, మత ఛాందసవాదులు, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేతుల్లో పోశాయి. డిస్‌ఇన్‌ఫ్లో ల్యాబ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిని ‘కొవిడ్ కుంభకోణం 2021’గా అభివర్ణించింది.

భారత్‌కు సాయం పేరుతో పాక్ స్వచ్ఛంద సంస్థలు ఏప్రిల్ 27, 28 తేదీల్లో అమెరికాలో విరాళాలు సేకరించాయి. ఇలా సేకరించిన వాటిలో ఇమానా ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంస్థ కూడా ఉంది. ఇది పెద్ద ఎత్తున విరాళాలు సేకరించింది. ఇస్మాయిల్ మెహర్ అనే వైద్యుడి ఆధ్వర్యంలో ఈ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో తొలుత రూ. 1.8 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన రావడంతో లక్ష్యాన్ని రూ. 5 కోట్లకు పెంచింది. అయితే, అది కూడా మించిపోయి ఏకంగా రూ. 8.7 కోట్లు సమకూరాయి.

ఇలా మొత్తం 150 కోట్ల వరకు విరాళాలు సేకరించిన సంస్థ ఇందులో రూ. 30 కోట్లు ఖర్చు చేసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కులు, ఇతర వైద్య సామగ్రిని కొనుగోలు చేసి భారత్‌కు అందించినట్టు తెలిపింది. అయితే, ఈ సంస్థ నుంచి ఎలాంటి సాయమూ అందలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.


More Telugu News