జనాభా లెక్కలను విడుదల చేసిన కేంద్రం.. ఏపీలో జననాల్లో కర్నూలు టాప్!

  • నిమిషానికి సగటున 51 మంది శిశువుల జననం, 16 మంది మరణం
  • ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో మరణాలు అధికం
  • లింగనిష్పత్తిలో తెలంగాణ కంటే బాగా వెనకబడిన ఏపీ
  • ఏపీ జనాభా 5.23 కోట్లు.. తెలంగాణ జనాభా 3.72 కోట్లు
2019లో దేశంలో జనన, మరణాలకు సంబంధించిన తాజా జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లు. 2019లో 2.67 కోట్ల జననాలు నమోదు కాగా, 83 లక్షల మంది చనిపోయారు. నిమిషానికి సగటున 51 మంది శిశువులు జన్మిస్తుంటే, 16 మంది కన్నుమూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లుగా, తెలంగాణ జనాభా 3.72 కోట్లుగా నివేదిక పేర్కొంది. లింగ నిష్పత్తిలో ఏపీ 16వ స్థానంలో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో జననాల్లో కర్నూలు ముందుండగా, మరణాల్లో తూర్పుగోదావరి జిల్లా ముందున్నాయి. 2019లో ఏపీలో 7,54,939 మంది జన్మించారు. 4,01,472 మంది మరణించారు. మరణించిన వారితో పోలిస్తే జన్మించిన వారి సంఖ్య 88 శాతం అధికం. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం 2019 మధ్య నాటికి ఏపీ మొత్తం జనాభా 5,23,15,000.

ఇక, లింగ నిష్పత్తిలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. జనన సమయాల్లో  ఏపీలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు 935 మంది బాలికలే జన్మిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ 16వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో తెలంగాణలో ఈ నిష్పత్తి 953గా ఉంది. ఫలితంగా ఏడో స్థానంలో నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్‌ ఈ విషయంలో అందరికంటే ముందుంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 1024 మంది బాలికలు ఉన్నారు.  రెండో స్థానంలో ఉన్న నాగాలాండ్‌లో ఈ సంఖ్య 1001గా ఉంది. ఇక, ఆ తర్వాతి స్థానాల్లో మిజోరం (975), అండమాన్ (965), కేరళ, ఉత్తరాఖండ్‌ (960), తెలంగాణ (953) నిలిచాయి.


More Telugu News