యడియూరప్పే ముఖ్యమంత్రి.. పునరుద్ఘాటించిన కర్ణాటక బీజేపీ ఇన్‌ఛార్జి

  • కర్ణాటక బీజేపీలో విభేదాలంటూ వార్తలు
  • కొత్త సీఎం కావాలని ఇద్దరు ఎమ్మెల్యేల డిమాండ్‌
  • దీని ఆధారంగా పార్టీలో ముసలం అని ఊహాగానాలు
  • సీఎంను మారుస్తున్నారంటూ వార్తలు
  • కొట్టిపారేసిన ఇన్‌ఛార్జి అరుణ్‌ సింగ్‌
కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్‌.యడియూరప్పే కొనసాగుతారని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ ఇన్‌ఛార్జి అరుణ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. దీంతో త్వరలో సీఎంను మార్చబోతున్నారన్న ఊహాగానాలకు తెరదించారు.

సీఎం మార్పు ఊహాగానాల మధ్య గురువారం బెంగళూరు చేరుకున్న అరుణ్‌ సింగ్‌ దాదాపు 60 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అందరూ యడియూరప్పకు అనుకూలంగానే ఉన్నారని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక తెలిపారు. ఒకరిద్దరు మాత్రమే నిరసనగళం వినిపిస్తున్నారన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశోకతో పాటు అరుణ్‌ సింగ్‌ కూడా స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్‌, బసనగౌడ పాటిల్‌ యత్నల్ ఇటీవల యడియూరప్పకు వ్యతిరేకంగా గళం వినిపించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మరొకరిని సీఎం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు వర్గాలుగా చీలిపోయారని.. ఓ వర్గం యడియూరప్ప స్థానంలో మరొకరిని సీఎంగా నియమించాలని డిమాండ్‌ చేస్తోందని ఊహాగానాలు వినిపించాయి. ఆ మేరకు సీఎం కుర్చీలో కొత్తవారు కూర్చోబోతున్నారన్న అంశంపై గత కొంతకాలంగా బెంగళూరు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో అరుణ్ సింగ్‌ కర్ణాటకకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.


More Telugu News