త్వరలో భారత్‌లో అందుబాటులోకి జైకొవ్‌-డి కరోనా టీకా!

  • త్వరలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోనున్న జైడస్ క్యాడిలా
  • భారత వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి లభించనున్న ఊతం
  • ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ జైకొవ్‌-డి
  • పిల్లల్లోనూ పరీక్షిస్తున్న సంస్థ
భారత్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి త్వరలో మరింత ఊతం లభించబోతోంది. అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్‌ క్యాడిలా.. తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ జైకొవ్‌-డి వినియోగానికి అత్యవసర అనుమతి కోసం 7-10 రోజుల్లో డీసీజీఐకి దరఖాస్తు చేసుకోబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయినట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌ కోసం మొత్తం 28 వేల మంది వాలంటీర్లను నియమించుకున్నారు.

ఈ వ్యాక్సిన్‌ పురోగతిపై ఇటీవల నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌.వి.కె.పాల్‌ సైతం స్పందించారు. త్వరలో జైకొవ్-డి అత్యవసర అనుమతి కోసం జైడస్‌ క్యాడిలా దరఖాస్తు చేసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఇదేనని వెల్లడించారు. మరోవైపు అనుమతి లభిస్తే ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఐదు కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని అందుబాటులోకి తెస్తామని జైడస్‌ క్యాడిలా తెలిపింది.

వయోజనులతో పాటు జైకొవ్‌-డి వ్యాక్సిన్‌ను 12-17 ఏళ్ల మధ్య పిల్లలపై కూడా పరీక్షిస్తున్నారు. ఫలితాలను బట్టి డీసీజీఐ అనుమతిస్తే పిల్లలకు కూడా త్వరలో జైకొవ్‌-డి అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే.. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన నాలుగో కరోనా టీకా అవుతుంది. ఇప్పటికే జైడస్‌ క్యాడిలా నుంచి విరాఫిన్‌ అనే డ్రగ్‌ను సైతం కరోనా చికిత్సలో వినియోగించేందుకు డీసీజీఐ అనుమతించింది.


More Telugu News