అశోక్ గజపతిరాజు అక్రమాలపై విచారణ జరుపుతున్నాం... త్వరలో జైలుకు వెళతారు: విజయసాయిరెడ్డి

  • మాన్సాస్ చైర్మన్ గా అశోక్ గజపతి పునర్నియామకం
  • వైసీపీ నేతల ఫైర్
  • అశోక్ వందల ఎకరాలు దోచుకున్నారన్న విజయసాయి
  • ఆయనపై ఫోర్జరీ కేసు కూడా ఉందని వెల్లడి
మాన్సాస్, సింహాచలం దేవస్థానం ట్రస్టులకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజు పునర్ నియమితుడైన సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయితను నియమిస్తూ ఏపీ సర్కారు జారీ చేసిన జీవోను ఇటీవల విచారణలో హైకోర్టు కొట్టివేసింది. మాన్సాస్, సింహాచలం దేవస్థానం ట్రస్టులకు అశోక్ గజపతిరాజే వంశపారంపర్య ట్రస్టీ అని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు తీర్పు అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు ఆయపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అదే రీతిలో ధ్వజమెత్తారు.

అశోక్ గజపతిరాజు వందల ఎకరాల భూములను దోచుకున్న వ్యక్తి అని ఆరోపించారు. ఆయనపై ఒక ఫోర్జరీ కేసు కూడా ఉందని, ఆయన అక్రమాలపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. త్వరలోనే అశోక్ గజపతిరాజు జైలుకు వెళతారని స్పష్టం చేశారు.

మాన్సాస్ ట్రస్టులో పురుషులే అధికార పీఠానికి అర్హులు అంటూ నిబంధన తీసుకువచ్చి, మహిళలపై వివక్ష ప్రదర్శించారని విజయసాయి విమర్శించారు. స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేదని సుప్రీంకోర్టు పేర్కొంటే... అశోక్ గజపతిరాజు మాత్రం సొంత ప్రయోజనాల కోసం నియమాలు రూపొందించారని ఆరోపించారు. అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టుకు మాత్రమే చైర్మన్ అని, విజయనగరానికి రాజు కాదని స్పష్టం చేశారు.


More Telugu News