ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ప‌ద‌వి పొడిగింపు స‌రికాదు: కేంద్రానికి ఎంపీ క‌న‌క‌మేడ‌ల లేఖ‌

  • ఆదిత్య‌నాథ్ దాస్ పై నేరారోప‌ణ‌లు  
  • ప్ర‌భుత్వ సేవ‌లు దుర్వినియోగం
  • వైఎస్సార్ హ‌యాంలో ఇండియా సిమెంట్స్ లో జ‌గ‌న్ పెట్టుబ‌డులు
  • జ‌గ‌న్‌తో పాటు ఆదిత్య‌నాథ్‌పైనా సీబీఐ కేసు
ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నీలం సాహ్ని ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను నియమించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 30న ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉంది. అయితే, ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించాల‌ని తీసుకున్న నిర్ణ‌యంపై టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ అభ్యంత‌రాలు తెలిపారు.

ఏపీ సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ప‌ద‌వి పొడిగింపు స‌రికాదంటూ  కేంద్ర సిబ్బంది వ్య‌వ‌హారాల విభాగానికి క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్  లేఖ రాశారు. నేరారోప‌ణ‌లు ఉన్న సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ప‌ద‌వీ కాలాన్ని ఎలా పొడిగిస్తార‌ని ఆయ‌న అడిగారు.

ప్ర‌భుత్వ సేవ‌లు దుర్వినియోగం చేసిన వారికి ప‌ద‌వీ కాలం పొడిగింపు త‌గ‌దని, జ‌గ‌న్‌పై ఉన్న సీబీఐ కేసులో ఆదిత్య‌నాథ్ దాస్‌పై కూడా తీవ్ర నేరారోప‌ణ‌లు ఉన్నాయ‌ని క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ పేర్కొన్నారు. ఆయ‌నపై జ‌ల వ‌న‌రుల శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌మ‌యంలో అభియోగాలు న‌మోద‌య్యాయ‌ని వివ‌రించారు.

వైఎస్సార్ హ‌యాంలో ఇండియా సిమెంట్స్ లో జ‌గ‌న్ పెట్టుబ‌డులు పెట్టార‌ని క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ గుర్తు చేశారు. అప్ప‌ట్లో ఇండియా సిమెంట్స్‌కు ఆదిత్య‌నాథ్ దాస్ అన‌ధికారికంగా నీటిని కేటాయించార‌ని చెప్పారు. జ‌గ‌న్‌తో పాటు ఆదిత్య‌నాథ్‌పైనా సీబీఐ కేసు న‌మోదు చేసింద‌ని అన్నారు.


More Telugu News