డెల్టా వేరియంట్​ పై కొవిషీల్డ్​ ప్రభావం 61%: కొవిడ్​ ప్యానెల్​ అధిపతి

  • ప్రతిరక్షకాలు బాగా ఉత్పత్తి అవుతున్నాయన్న ఎన్.కె. అరోరా
  • ఒక్క డోసు తీసుకున్నా సమర్థవంతంగా టీకా పనితీరు
  • బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ప్రభావం 90% అని వెల్లడి
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కారణమైన డెల్టా వేరియంట్ పై కొవిషీల్డ్ ప్రభావం 61 శాతంగా ఉందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ అధిపతి డాక్టర్ ఎన్.కె. అరోరా అన్నారు. ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా డెల్టా వేరియంట్ పై సమర్థంగా పనిచేస్తోందని భారత్ లో చేసిన అధ్యయనంలో తేలిందని చెప్పారు. యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతున్నాయన్నారు.

అయితే, దాని సామర్థ్యాన్ని వాస్తవ పరిస్థితుల ఆధారంగా అంచనా వేసి నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. 12 వారాల గడువుతో సెకండ్ డోసు తీసుకుంటే కొవిషీల్డ్ ప్రభావం 65 నుంచి 80 శాతం దాకా ఉన్నట్టు ఇటీవల పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్  కార్బివ్యాక్స్ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని అరోరా చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయని, అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. అన్ని వేరియంట్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తోందన్నారు. అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ వ్యాక్సిన్ ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోందని, అది కూడా 90 శాతం ప్రభావాన్ని చూపిస్తోందని అన్నారు. జెన్నోవా బయోఫార్మాస్యుటికల్స్ తయారు చేస్తున్న దేశంలోనే తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్  ఫేజ్ 2 ట్రయల్స్ దశలో ఉందన్నారు.


More Telugu News