లాక్​ డౌన్​ కష్టాలు: పది రోజులపాటు తల్లి, ఐదుగురు పిల్లల పస్తులు!

  • 2 నెలలు పొరుగు వారిచ్చే రొట్టెలే దిక్కు
  • పది రోజులుగా అవీ అందని వైనం
  • నీరసించిపోయిన తల్లి, ఐదుగురు పిల్లలు
  • గత ఏడాదే కరోనాతో ఇంటి పెద్ద మృతి
రెక్కాడితేనే ఆ కుటుంబం డొక్కాడేది. కానీ, ఆ రెక్కాడించే పని లాక్ డౌన్ తో దూరమైంది. డబ్బు రావడం గగనమైంది. దాదాపు రెండు నెలల పాటు ఇరుగుపొరుగు వారు ఇచ్చే రొట్టె ముక్కలే కడుపు నింపేవి. వారు మాత్రం ఎంతకాలమని ఇస్తారు! దీంతో అవీ అందడం బంద్ అయింది. దీంతో పది రోజులు ఆ కుటుంబం కడుపుకట్టుకుని పస్తులుండాల్సి వచ్చింది. చివరికి ఆసుపత్రి పాలైంది.

కరోనా మహమ్మారి ఎందరి కడుపులు కొడుతోందో తెలియజెప్పే ఈ దయనీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. గుడ్డి (40) భర్త గత ఏడాది కరోనాకు బలయ్యాడు. ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు. భర్త చనిపోవడంతో ఆమె, ఆమె పెద్ద కుమారుడు అజయ్ (20) కుటుంబ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో కార్మికురాలిగా గుడ్డి చేరితే.. కూలీ పనికి వెళ్తూ అజయ్ డబ్బులు సంపాదించారు.

కానీ, ఏప్రిల్ లో విధించిన లాక్ డౌన్ తో వారి బతుకులు చిందరవందరయ్యాయి. పని పోయింది. తినడానికి టికానా దొరకడం కష్టమైపోయింది. రెండు నెలల పాటు పక్కింటి వారు పెట్టే రొట్టెలు తిని బతికినా.. ఆ తర్వాత వారూ పెట్టడం మానేశారు. దీంతో పది రోజులు తిండి లేక ఇంట్లోనే నీరసించి పోయారు. ఇరుగుపొరుగు సమాచారంతో కొందరు వ్యక్తులు వారిని మంగళవారం అలీగఢ్ లోని మల్ఖాన్ సింగ్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.  

ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ సింగ్.. వెంటనే అధికారులను ఆసుపత్రికి పంపించారు. ఆర్థిక సాయంతో పాటు భోజన ఏర్పాట్లు చేశారు. రూ.5 వేలతో పాటు నిత్యావసరాలు, ఇతర సరుకులను అందజేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, వారికి మరింత సాయం చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇంటింటి సర్వే చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.


More Telugu News