ఉత్తర కొరియా ప్రజలు కొంతకాలం ఆంక్షలకు సిద్ధపడాలి: కిమ్ జాంగ్ ఉన్

  • కిమ్ అధ్యక్షతన సెంట్రల్ కమిటీ సమావేశం
  • గతేడాది టైఫూన్ తో వ్యవసాయరంగం కుదేలైందన్న కిమ్
  • దేశంలో ఆహార సంక్షోభం ముప్పు ఏర్పడిందని వెల్లడి
  • కొద్దిమేర ఆర్థిక స్థితి మెరుగైందని వివరణ
ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తెరపైకి వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతేడాది కంటే కొద్దిగా మెరుగైనప్పటికీ, దేశం ఆహార సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది దేశాన్ని కుదిపేసిన టైఫూన్లు (తీవ్ర తుపానులు), కరోనా మహమ్మారి వ్యాప్తి తదితర అంశాలతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. దేశంలో ప్రధాన సంస్కరణల అమలు, ఆర్థిక సంక్షోభం నివారణకు చర్యలు తదితర అంశాలపై చర్చించేందుకు కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షతన అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీ నేడు సమావేశమైంది.

ఈ సమావేశంలో కిమ్ మాట్లాడుతూ, గతేడాదితో పోల్చితే పారిశ్రామిక ఉత్పాదకత 25 శాతం మెరుగైందని, మొత్తమ్మీద ఈ ఏడాది ప్రథమార్థంలో ఆర్థిక స్థితి కుదుటపడిందని వెల్లడించారు. అయితే ఆహార లభ్యతకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, గతేడాది వచ్చిన టైఫూన్ తో వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రజలు కూడా కొన్ని ఆంక్షలు ఎదుర్కొనడానికి సిద్ధపడాలని కిమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.


More Telugu News