నేను సింహం బిడ్డను: రెబెల్స్ కు చిరాగ్ పాశ్వాన్ వార్నింగ్

  • లోక్ జనశక్తి పార్టీలో చీలిక
  • రెబెల్ గ్రూపుగా ఏర్పడిన ఐదుగురు ఎంపీలు
  • న్యాయ పోరాటం చేస్తానన్న చిరాగ్ పాశ్వాన్
లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరాగ్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ తన వర్గీయులతో కలిసి పార్టీని అధీనంలోకి తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ ను తొలగించి ఏకాకిని చేశారు.  

పార్టీకి చెందిన మొత్తం ఆరుగురు ఎంపీలలో (చిరాగ్ కూడా ఒకరు) పశుపతి సహా ఐదుగురు ఓ జట్టుగా వున్నారు. లోక్ సభ పక్ష నేతగా పశుపతిని ఎన్నుకుని, స్పీకర్ కు ఆ విషయాన్ని తెలియజేయడం.. ఆయన వీరిని గుర్తించడం కూడా జరిగిపోయాయి. ఈ పరిణామాలను చిరాగ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేశంతో ఆ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  

ఈ నేపథ్యంలో రెబెల్ గ్రూపుపై చిరాగ్ నిప్పులు చెరిగారు. తాను రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడినని... సింహం బిడ్డనని చిరాగ్ అన్నారు. అంతలోనే "నేను అనాథనయింది నా తండ్రి పోయిననాడు కాదు.. ఈవేళ మా బాబాయ్ నన్ను వదిలేసి వెళ్లడంతోనే నేను అనాథనయ్యాను" అంటూ చిరాగ్ ఆవేదన కూడా వెలిబుచ్చారు.

"నేను అనారోగ్యంతో వున్న సమయం చూసి వీరంతా ఈ కుట్ర పన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు నేను, మా  అమ్మ కలిసి బాబాయ్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం. కానీ, వీలుపడలేదు.. బాబాయ్ నన్ను ఒకమాట అడిగి ఉంటే, నేనే ఆయనని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేసి ఉండేవాడిని. ఏదేమైనా, దీనిపై చట్టపరంగా పోరాడుతా" అన్నారు చిరాగ్.


More Telugu News