కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ

  • బ్లాక్ ఫంగస్ అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు
  • వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం
  • ఇంజెక్షన్ల కొరత ఉందన్న ఏపీ సర్కారు
  • చర్యలు తీసుకుంటున్నామన్న కేంద్రం
  • వెంటనే స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు ఆదేశం
రాష్ట్రంలో కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ద్విసభ్య ధర్మాసనం నేడు వాదనలు విన్నది. ఆధార్ తో పనిలేకుండా వృద్ధాశ్రమాల్లో కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో 2,357 బ్లాక్ ఫంగస్ కేసులు, 175 మరణాలు నమోదయ్యాయని వివరించింది. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 1,385 అని వెల్లడించింది.

బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ల సరఫరాలో కొరత ఉందని సర్కారు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వారానికి 8-10 వేలకు మించి ఇంజెక్షన్లు రావడంలేదని వివరించింది. డిమాండ్ కు తగిన విధంగా కేంద్రం యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను సరఫరా చేయడంలేదని ఆరోపించింది.

ఈ సందర్భంగా కోర్టు తన అభిప్రాయాలు వెల్లడించింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఇంజెక్షన్ల సరఫరా పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను ద్విసభ్య ధర్మాసనానికి నివేదించారు. కేంద్రం యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ల తయారీ కోసం 11 ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.

కేంద్రం వాదనలు విన్న హైకోర్టు స్పందిస్తూ... ఎన్ని ఇంజెక్షన్లు కావాలో ఆ వివరాలతో పూర్తిస్థాయి కౌంటర్ వేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది. బ్లాక్ ఫంగస్ తీవ్రత దృష్ట్యా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.


More Telugu News