ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో పొగలు

  • తలమడుగు మండలం డోర్లి గేట్ వద్ద ప్రమాదం
  • సాంకేతిక సమస్యల వల్ల ఇంజిన్ లో పొగలు
  • మరో ఇంజిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రజలకు ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్ సిటీ రైలు అత్యంత ముఖ్యమైనది. ప్రతి రోజు ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తుంటారు. అయితే, ఈ రైలుకు ప్రమాదం సంభవించింది. రైలు ఇంజిన్ లో ఒక్కసారిగా పొగలు రావడంతో కలకలం రేగింది. అయితే, లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు రైలు చేరుకోగానే... రైలు ఇంజిన్ లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇంజిన్ ను పొగలు నింపేశాయి. దీంతో, వెంటనే రైలును లోకో పైలట్ నిలిపివేశాడు. గంటకు పైగా రైలును డోర్లి గేట్ వద్ద ఆపేశాడు. ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి మరో ఇంజిన్ వచ్చిన తర్వాత, రైలుకు ఇంజిన్ అమర్చి పంపించారు.

ప్రమాదం సంభవించిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇంజిన్ లో సాంకేతిక లోపం వచ్చినందువల్లే పొగలు వచ్చాయని చెప్పారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఏదేమైనప్పటికీ ప్రయాణికులు మాత్రం మరో రైలు వచ్చేంత వరకు వేచి చూడక తప్పలేదు.


More Telugu News