కాంగ్రెస్​ తో పొత్తా?.. ఆ ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన అఖిలేశ్​ యాదవ్​

  • 2022 యూపీ ఎన్నికల్లో పోటీపై స్పష్టత
  • బీఎస్పీతోనూ ఉండదని తేటతెల్లం
  • చిన్నపార్టీలతో ముందుకెళ్తామని వెల్లడి
  • యోగి సర్కార్ తో ప్రజలు విసుగెత్తారని కామెంట్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగానాలను సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొట్టిపారేశారు. ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2022లో జరగనున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

ఆ పార్టీలతో తమకు చాలా అనుభవమే ఉందని, మరోసారి వారితో జట్టుకట్టబోమని తెలిపారు. పెద్ద పార్టీలతో పొత్తు ఉండదని, చిన్న పార్టీలతోనే కలసి ముందుకు వెళతామని ఆయన చెప్పారు. తమకు ఎవరు మంచో యూపీ ప్రజలే తేలుస్తారన్నారు.

బీజేపీ పాలనతో ప్రజలు విసుగెత్తారని, అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ యోగి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ద్రవ్యోల్బణంతో ధరలు భారీగా పెరిగాయని, రైతులు, ప్రజలు గోస పడుతున్నారని అన్నారు. వాటన్నింటిపై సర్కారుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు అతి సమీపంలోని ఉన్నాయని హెచ్చరించారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో దయనీయ పరిస్థితులున్నాయని, అంతా దేవుడిపైనే భారం వేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రజలు వారికి వారే బెడ్లు, ఆక్సిజన్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితులు వచ్చాయన్నారు. అప్పట్లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక వసతులనే ఇప్పుడు యోగి సర్కార్ వినియోగించుకుందని ఎద్దేవా చేశారు.


More Telugu News