కాంగ్రెస్‌ ఇక ఏమాత్రం నిద్రాణ స్థితిలో లేదని నిరూపించాలి: కపిల్‌ సిబల్‌

  • విస్తృత సంస్కరణలు చేపట్టాలని హితవు
  • బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే
  • అసోం, బెంగాల్‌ ఎన్నికల్లో పరాభవానికి పొత్తులే కారణం
  • ప్రత్యర్థులు బలంగా ఉంటే బీజేపీని ఓడించగలం
  • భారత్‌కు పునరుజ్జీవింపజేసిన కాంగ్రెస్‌ అవసరం ఉంది
  • దేశానికి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలి
కాంగ్రెస్‌ ఇక ఏమాత్రం నిద్రాణ స్థితిలో లేదని నిరూపించడానికి పార్టీలో అన్ని స్థాయిల్లో విస్తృత సంస్కరణలు చేపట్టాలని పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ సూచించారు. బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని చూపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళించాలని, అంతర్గత ఎన్నికలు జరపాలని కోరుతూ గత ఏడాది పార్టీ అధ్యక్షురాలికి లేఖ రాసిన 23 మంది నాయకుల్లో సిబల్‌ ఒకరు.

ఎన్నికల్లో పరాజయం పాలైనప్పుడు.. ఆత్మపరిశీలన కోసం కమిటీలు నియమించడం సరైన చర్య అని తెలిపిన సిబల్‌.. ఆ కమిటీ సూచించిన పరిష్కారాలను అమలు చేస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. అసోం, బెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కుదుర్చుకున్న పొత్తులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరాభవానికి ఇది కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఓ బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని.. దాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ అధిష్ఠానానికి సూచనలు పంపానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు గెలిచిన విషయాన్ని సిబల్‌ గుర్తుచేశారు. ప్రత్యర్థులు బలంగా ఉంటే బీజేపీని ఓడించగలమని దీంతో నిరూపితమైందన్నారు.

భారత్‌కు పునరుజ్జీవింపజేసిన కాంగ్రెస్‌ అవసరం ఉందని సిబల్‌ అభిప్రాయపడ్డారు. కానీ, అందుకు పార్టీ క్రియాశీలకంగా, ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధంగా ఉందని నిరూపించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆవేదనను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దేశహితం కోసం కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నంలో పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News