బ్రహ్మంగారి మఠం వివాదంపై శివస్వామి స్పందన

  • కడప జిల్లా చేరుకున్న శివస్వామి
  • త్వరలో పీఠాధిపతిని ఎంపిక చేస్తామని వెల్లడి
  • రెండో భార్య వద్ద ఉన్న వీలునామా చెల్లదని స్పష్టీకరణ
  • పెద్ద భార్య కుమారుడికే అవకాశం ఉంటుందని వివరణ
కడప జిల్లా బనగానపల్లెలో ఉన్న బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి ఎవరన్నదానిపై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇతర పీఠాధిపతులు ప్రయత్నిస్తున్నారు. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఈ క్రమంలో కడప జిల్లాకు చేరుకున్నారు. వివాదంపై ఆయన మాట్లాడుతూ, తాము ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా రాలేదని తెలిపారు. విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరఫున వివాదానికి తెరదించేందుకు వచ్చామని స్పష్టం చేశారు.

దేవాదాయశాఖతో సంబంధం లేకుండా పీఠాధిపతిని ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఇటీవల పరమపదించిన బ్రహ్మంగారి మఠ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండోభార్య మహలక్ష్మమ్మ వద్ద ఉన్న వీలునామా చెల్లదని శివస్వామి అన్నారు. వారసత్వంగా పెద్ద కుమారుడు వెంకటాద్రికే పీఠాధిపతి అవకాశం వస్తుందని పేర్కొన్నారు. బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేక అధికారిని నియమించడం హర్షణీయమని తెలిపారు.

కాగా, బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశంలో ఇతరుల జోక్యం అవసరంలేదని దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య మహలక్ష్మమ్మ ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారు. పెద్ద భార్య కుమారుడ్ని పీఠాధిపతిని చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.


More Telugu News