చైనాలో పేలిన గ్యాస్​ పైప్​ లైన్​.. 12 మంది మృతి, 144 మందికి గాయాలు

  • 37 మంది పరిస్థితి విషమం
  • షియాన్ సిటీలో ప్రమాదం
  • కొనసాగుతున్న సహాయ చర్యలు
చైనాలో భారీ పేలుడు సంభవించింది. హ్యూబెయ్ ప్రావిన్స్ లోని షియాన్ సిటీలోని ఓ నివాస సముదాయం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించిందని స్థానిక సీసీటీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 144 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో మరో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. 2013లో ఈశాన్య ప్రాంతంలోని ఖింగ్డావోలో జరిగిన పేలుడులాగే ఈ పేలుడూ సంభవించి ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు భూగర్భంలోని పైప్ లైన్ లు లీకై పెద్ద పేలుడు సంభవించడంతో 55 మంది చనిపోయారు.

కాగా, 2015లో ఓ రసాయన గోదాములో జరిగిన ప్రమాదంలో 173 మంది మరణించారు. అందులో ఎక్కువగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులే ఉన్నారు. గోదామును అక్రమంగా నిర్మించడం, అనుమతుల్లేకుండా రసాయనాలను దాచడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి.


More Telugu News