వికెట్లను తన్నిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబల్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం

  • ఢాకా ప్రీమియర్ లీగ్‌లో షకీబల్ అనుచిత ప్రవర్తన
  • వికెట్లను పీకి గిరాటేసిన ఆల్‌ రౌండర్
  • లెవల్-3 నేరం కింద మూడు మ్యాచ్‌ల నిషేదం
  • 5800 డాలర్ల జరిమానా
ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్‌లో వికెట్లను తన్ని అనుచితంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మూడు మ్యాచ్‌ల నిషేధంతోపాటు 5,800 డాలర్ల (బంగ్లాదేశ్ కరెన్సీలో 5 లక్షల టాకాలు) జరిమానా విధించింది. నిజానికి అతడిపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని భావించారు. అయితే, బంగ్లాదేశ్ బోర్డు మాత్రం చాలా తక్కువ శిక్షతో సరిపెట్టింది.

ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్‌లో  భాగంగా మొన్న అబహని లిమిటెడ్-మహ్మదాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహ్మదాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్న షకీబల్ ఎల్బీడబ్ల్యూ విషయంలో హద్దు మీరి ప్రవర్తించాడు. అప్పీల్ చేసినా అవుట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతూ వికెట్లను కాలితో బలంగా తన్ని అంపైర్ మీదిమీదికి వెళ్లి గొడవకు దిగాడు.

ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసిన తర్వాత అంపైర్లతో మరోమారు వాదనకు దిగాడు. మరొక్క బంతి వేసి ఉంటే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితం తేలి ఉండేదని, బంతి వేసే అవకాశం ఉన్నా మ్యాచ్‌ను నిలిపివేశారంటూ వికెట్లను పీకి విసిరికొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

షకీబల్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బోర్డు లెవల్-3 నేరం కింద మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. కాగా, షకీబ్ ఇది వరకే ఫిక్సింగ్ కేసులో ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు.


More Telugu News