భారత్‌లో అధికారిక లెక్కల కంటే ఎక్కువ కొవిడ్‌ మరణాలా? అవన్నీ నిరాధార కథనాలు: కేంద్రం

  • భారత్‌లో 5-7శాతం అధిక మరణాలంటూ ది ఎకనమిస్ట్‌ కథనం
  • ఊహాజనిత కథనమని కొట్టిపారేసిన కేంద్రం
  • మరణాలు అంచనా వేయడంలో సరైన పద్ధతులు అవలంబించలేదని వెల్లడి
  • ధ్రువీకరించని సమాచారంతో మరణాల లెక్కలు
భారత్‌లో కరోనా మరణాలు ప్రభుత్వ అధికారిక లెక్కల కంటే 5-7 శాతం అధికంగా ఉంటాయంటూ నిరాధార కథనాన్ని ప్రచురించిన ‘ది ఎకనమిస్ట్‌’పై కేంద్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేకుండానే తప్పుడు సమాచారాన్ని ప్రచురించారని తిప్పికొట్టింది. అది కేవలం ఊహాజనిత కథనమేనని కొట్టిపారేసింది.

దేశంలో మరణాలను అంచనా వేయడానికి ఎకనమిస్ట్‌ మ్యాగజైన్‌ అవలంభించిన పద్ధతులను కేంద్రం తప్పుబట్టింది. వారు రెఫరెన్స్‌గా తీసుకున్న ఆధారాలేవీ ధ్రువీకరించినవి కాదని తేల్చి చెప్పింది. ఇంటర్నెట్‌లో కొన్ని సైంటిఫిక్‌ డేటాబేసెస్‌ను ఆధారంగా చేసుకున్నారని.. వాటిలో మరణాల సంఖ్యను గణించడానికి సరైన విధానాలను అవలంబించలేదని తెలిపింది. అలాగే తెలంగాణలో జీవిత బీమా క్లెయింలను సైతం ఆధారంగా తీసుకున్నారని తెలిపింది.

అయితే, ఈ అధ్యయాన్ని సైతం ఎవరూ ధ్రువీకరించలేదని స్ఫష్టం చేసింది. ఇక ‘ప్రశ్నమ్’, ‘సీ-ఓటర్‌’ వంటి ఎన్నికల ఫలితాల్ని అంచనా వేసే సంస్థల వివరాలను కూడా ఎకనమిస్ట్‌ పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. వీరికి వైద్యారోగ్య రంగంలో సర్వేలు చేయడంపై అనుభవం లేదని.. వారు ప్రచురించిన డేటా నిజమైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అలాగే ఈ సంస్థలు నిర్వహించే ఎన్నికల సర్వే ఫలితాలు సైతం అనేక సార్లు సత్యదూరంగా ఉన్నట్లు రుజువైందని గుర్తుచేసింది.


More Telugu News