అదృష్టవంతుడు... తిమింగలం నోట్లోంచి బయటపడ్డాడు!

  • అమెరికాలో ఘటన
  • లోబ్ స్టర్ల వేటకు వెళ్లిన వ్యక్తి
  • సముద్రంలోకి డైవింగ్
  • నేరుగా తిమింగలం నోట్లో పడిన వైనం
  • ఒక్కసారిగా ఉమ్మేసిన తిమింగలం
తిమింగలాలు సముద్రంలో ఎంతటి కల్లోలం సృష్టిస్తాయో తెలిసిందే. పెద్ద బోటును సైతం అవలీలగా నీట ముంచేయగలవు. అంతటి తిమింగలం ముందు మనిషి ఎంత? కానీ ఆశ్చర్యకరంగా అమెరికాలో ఓ వ్యక్తి తిమింగలం నోట్లోకి వెళ్లి మరీ సురక్షితంగా బయటపడ్డాడు. మైకేల్ ప్యాకార్డ్ (56) అనే వ్యక్తి సముద్రంలో లోబ్ స్టర్లు (పెద్ద రొయ్యల వంటి జీవులు) వేటాడుతుంటాడు. మసాచుసెట్స్ లోని ప్రావిన్స్ పట్టణంలో ఎప్పట్లాగానే సముద్రంలో లోబ్ స్టర్ల వేటకు వెళ్లాడు. తన సహచరుడితో కలిసి బోటులో సముద్రంలో కొంతదూరం వెళ్లి, ఆపై లోబ్ స్టర్ల కోసం సీ డైవింగ్ చేశాడు.

ఆ దూకడంతో ప్యాకార్డ్ కు ఒక్కసారిగా ఏదో అగాథంలో పడిపోయిన భావన కలిగింది. కళ్ల ముందు చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. అయితే, తనను ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరిగే తెల్ల సొరచేప నోట కరుచుకుని ఉంటుందని భావించాడు. కానీ, ఆ భారీ జలచరానికి నోట్లో కోరలు లేకపోవడంతో, అది ఒక తిమింగలం అని అర్థం చేసుకున్నాడు. ప్యాకార్డ్ ఊహించింది నిజమే. అతడిని నోట కరుచుకుంది ఓ భారీ హంప్ బ్యాక్ తిమింగలం.

అదృష్టం ఏంటంటే... ఆ తిమింగలం ప్యాకార్డ్ ను మింగకుండా, సముద్రపు నీటిలోకి ఉమ్మేసింది. అంతెత్తున గాల్లోకి లేచిన ప్యాకార్డ్ దభీమని నీటిలోకి పడిపోయాడు. ఏమైతేనేం... బతుకు జీవుడా అనుకుంటూ ఆ లోబ్ స్టర్ వేటగాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాను బతుకుతానని ఏమాత్రం ఊహించలేదని, అంతా కలలా ఉందని ప్యాకార్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలిపాడు. మోకాలు స్థానభ్రంశం చెందినట్టుగా భావిస్తుండడంతో చికిత్స కోసం అతడు ఆసుపత్రిలో చేరాడు.

ఈ ఘటన తెలిసిన వెంటనే అతడి భార్య ఈ లోబ్ స్టర్ల వేట వద్దని స్పష్టం చేసిందట. కానీ 40 ఏళ్లుగా చేస్తున్న పని కావడంతో, ఇప్పుడే వేరే ఉపాధి వెతుక్కోలేనని ప్యాకార్డ్ చెబుతున్నాడు. హంప్ బ్యాక్ తిమింగలాలు 50 అడుగుల పొడవు, 36 టన్నుల బరువు పెరుగుతాయట. ప్రపంచవ్యాప్తంగా ఇవి 60 వేల వరకు ఉండొచ్చని వరల్డ్ వైల్డ్ లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనా వేసింది.


More Telugu News