భారత్​ లో కరోనా టీకాల ఉత్పత్తి పెరగాలంటే.. ముడి సరుకుపై ఆంక్షలు ఎత్తేయాల్సిందే: ఫ్రాన్స్​ అధ్యక్షుడు

  • జీ7 దేశాలకు సూచన
  • ఉత్పత్తి పెరిగితేనే అందరికీ టీకాలు
  • నేటి నుంచి జీ7 సదస్సు
ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను వేగంగా అందించాలంటే.. భారత్ లో ఉత్పత్తి పెరగాలని, అందుకు జీ7 దేశాలు ముడి సరుకు ఎగుమతులపై పెట్టిన ఆంక్షలను ఎత్తేయాల్సిన అవసరముందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అన్నారు. ఇవ్వాళ్టి నుంచి జీ7 సదస్సు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

జీ7 దేశాలు టీకాల ముడి సరుకు మీద నిషేధం విధించడం వల్ల వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. సంస్థకు ముడిసరుకు అందకపోవడం వల్ల విదేశాలకు ఇచ్చిన కమిట్ మెంట్లను అందుకోలేకపోతోందని చెప్పారు.

కాబట్టి ఇలాంటి ఆంక్షలను ఎత్తేస్తే భారత్ లాంటి దేశాల్లో ఉత్పత్తి పెరుగుతుందని, అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వగలుగుతామని మేక్రాన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల మీద తాత్కాలికంగా పేటెంట్ హక్కులను రద్దు చేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు ఆయన మరోసారి మద్దతును తెలియజేశారు. సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఆస్ట్రేలియా ప్రధాని వర్చువల్ గా పాల్గొననున్నారు.


More Telugu News