కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలకు కేంద్రం అండ

  • ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల రుణం
  • బాధిత కుటుంబాలను గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
  • నేటి నుంచి ప్రారంభం కానున్న గుర్తింపు ప్రక్రియ
కరోనా కారణంగా సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి 20 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వడం ద్వారా వారి కుటుంబాలను తిరిగి నిలబెట్టనుంది. ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) ద్వారా వీరికి రుణం అందనుంది. అందుకున్న రుణంలో 20 శాతం రాయితీ పోను మిగతా మొత్తాన్ని 6 శాతం వడ్డీతో వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలు కూడా విధించింది.

మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు. కుటుంబంలో తల్లిదండ్రులు మరణించినా, సంపాదించే వ్యక్తి మరణించినా సాయం లభిస్తుంది. అయితే, కుటుంబ పెద్ద కొవిడ్‌తో మరణించినట్టు ధ్రువీకరణ పత్రం ఉండడంతోపాటు కుటుంబం మొత్తం అతడిపైనే ఆధారపడి ఉండాలి.

ఈ మేరకు ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను గుర్తించి జాబితా పంపాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) కోరింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి బాధిత కుటుంబాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించాలంటూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఎండీ నవ్య నిన్న ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News