కారు అద్దెలతో బాగా ఆదాయం వస్తుందంటూ మోసాలు... గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

  • ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఇద్దరు సభ్యుల అరెస్ట్
  • మరో వ్యక్తి కోసం గాలింపు
  • 29 కార్లు స్వాధీనం
సొంత కార్లను అద్దెకు తిప్పుకుంటే అధిక ఆదాయం వస్తుందంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును విజయనగరం పోలీసులు రట్టు చేశారు.ఈ గ్యాంగులో ముగ్గురు సభ్యులుండగా, ఎం.చంద్రమౌళి (పార్వతీపురం), ఎల్.శివరామకృష్ణ (సీతంపేట)లను పోలీసులు అరెస్ట్ చేశారు. బొబ్బిలి పట్టణానికి చెందిన ఎస్.రవి కోసం గాలింపు జరుగుతోంది.  

ఈ ముఠా ఎలా మోసాలకు పాల్పడుతుందంటే.... సొంత కార్లు కలిగి ఉండి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తిస్తారు. కార్లను అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు కనీసం రూ.25 వేలకు తగ్గకుండా సంపాదించుకోవచ్చని నమ్మబలుకుతారు. అప్పటికే కారు ఈఎంఐలు కట్టలేక, వాహన నిర్వహణ ఖర్చులు భరించలేక సతమతమవుతున్న ఆ వ్యక్తులు... సదరు గ్యాంగ్ ఉచ్చులో ఇట్టే పడిపోయేవారు.

ఆ విధంగా వారి నుంచి కార్లు తీసుకుని, డబ్బు తిరిగివ్వకపోగా, కార్లను తమవద్దే ఉంచుకునేవారు. ఆ ముగ్గురు ముఠా సభ్యులు ఏకంగా 29 కార్లను చేజిక్కించుకున్నారు. కార్లను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే ఈ ముఠా మోసాలు వెల్లడయ్యాయి. ఈ ముఠా నుంచి రూ.2 కోట్ల విలువైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


More Telugu News