ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షల విషయాన్ని రాజకీయం చేస్తున్నాయి: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • ఏపీలో పరీక్షల రగడ
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • సీఎం జగన్ కు లేఖ రాసిన లోకేశ్
  • దొడ్డిదారిన మంత్రి పదవి పొందారన్న ఆదిమూలపు
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ మరోసారి సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. పరీక్షలు జరగనప్పటికీ, కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని, ఆలిండియా పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా విద్యార్థులకు సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేదు అన్నప్పుడే,  విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి భయంలేని పరిస్థితుల్లోనే పరీక్షలు చేపడతామని, దీనిపై అధికారులతో కూడా చర్చించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. పరీక్షలు రద్దు చేయడానికి పెద్దగా సమయం అక్కర్లేదని, కానీ విద్యార్థుల భవిష్యత్ ను తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని వివరించారు.

ఒక తండ్రిగా తాను పరీక్షలు జరిపేందుకే మొగ్గు చూపుతానని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ లాగా అందరూ దొడ్డిదారిలో మంత్రి పదవి పొందలేరని విమర్శించారు. స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో లోకేశ్ కు ఎలా సీటు వచ్చిందో చెప్పాలన్నారు. లోకేశ్ లాగా అందరికీ హెరిటేజ్ తరహాలో ఆస్తులు లేవని పేర్కొన్నారు.


More Telugu News