అంపైర్ పై చిందులేసిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్... వీడియో ఇదిగో!

  • దేశవాళీ మ్యాచ్ లో షకీబ్ వీరంగం
  • తనపై తాను నియంత్రణ కోల్పోయిన క్రికెటర్
  • వికెట్లను కాలితో తన్ని, పీకేసి నానా యాగీ చేసిన వైనం
  • చర్యలు తీసుకోవాలంటున్న క్రికెట్ అభిమానులు
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ఓ దేశవాళీ మ్యాచ్ లో అంపైర్ వీరంగం వేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అది కూడా ఒకసారి కాదు, రెండుసార్లు అంపైర్ పై తీవ్ర ఆగ్రహంతో చిందులేయడం పట్ల క్రికెట్ లోకం నివ్వెరపోయింది. ఓ దేశవాళీ మ్యాచ్ సందర్భంగా ఈ షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.

తన బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా, అంపైర్ మౌనంగా ఉండడంతో షకీబల్ హసన్ పట్టరాని ఆగ్రహంతో వికెట్లను కాలితో తన్ని అంపైర్ పైకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత మరోసారి, మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నవాడల్లా అంపైర్ దిశగా వచ్చి వికెట్లను పీకి ఎత్తేశాడు.

5.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేస్తున్నట్టు అంపైర్ ప్రకటించడాన్ని షకీబ్ భరించలేకపోయాడు. మరో బంతి వేస్తే 6 ఓవర్లు పూర్తయ్యేవని, డక్ వర్త్ లూయిస్ విధానం వర్తింపజేసేందుకు వీలయ్యేదని వాదిస్తూ అంపైర్ పై రెచ్చిపోయాడు. ఈ రెండు ఘటనల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షకీబల్ హసన్ పై చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, తన అనుచిత ప్రవర్తనపై షకీబ్ మ్యాచ్ తర్వాత క్షమాపణ చెప్పాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాడ్నయిన తాను అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని, దురదృష్టకర ఘటన అని పేర్కొన్నాడు. తన కారణంగా మ్యాచ్ రసాభాస అయినందుకు ఎంతో బాధగా ఉందని, రెండు జట్లకు, మేనేజ్ మెంట్లకు, మ్యాచ్ అధికారులకు క్షమాపణలు తెలియజేస్తున్నానని షకీబ్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. మరోసారి ఇలాంటి దుందుడుకు చర్యలు పునరావృతం కానివ్వనని స్పష్టం చేశాడు.


More Telugu News