'ఎవరిష్టం వారిది....' జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై బాలకృష్ణ వ్యాఖ్యలు

  • నేడు బాలయ్య బర్త్ డే
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించిన యాంకర్
  • పారదర్శకంగా ఉన్నవాళ్లకే పార్టీలో సముచిత స్థానం అని వెల్లడి
ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. ఈ రోజుల్లో ఎవరిష్టాలు వారివని, వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తాను పెద్దగా ఆలోచించడంలేదని, అయినా, టీడీపీ ఒక ఆవేశంలోంచి పారదర్శక రీతిలో పుట్టిన పార్టీ అని, అందులో పారదర్శకంగా ఉండేవాళ్లకే గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. ఇక, ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? అని యాంకర్ ప్రశ్నించడంతో, బాలయ్య సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. చిరునవ్వే ఆయన సమాధానం అయింది. ఆమె రెట్టించడంతో... "ప్లస్ అయి మైనస్ అయితే!" అంటూ తనదైన శైలిలో ఎదురు ప్రశ్న వేశారు.

అంతకుముందు, తన ఇద్దరు అల్లుళ్లకు ఎన్ని మార్కులు వేస్తారని యాంకర్ ప్రశ్నించగా, ఇద్దరూ రాజకీయాల్లో రాణిస్తున్నారని, నాయకత్వ లక్షణాలు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక, టీడీపీ యువ విభాగాన్ని అప్పగిస్తే చేపడతానంటూ, "నేను కూడా కుర్రాడ్నే కదా" అంటూ చమత్కరించారు.


More Telugu News