హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయండి: కేంద్రం ఆదేశాలు

  • హెల్త్‌కేర్‌ వర్కర్లలో తొలి డోసు కవరేజీ జాతీయ సగటు 82%
  • రెండో డోసు కవరేజీ మాత్రం 56%
  • ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో తొలి డోసు జాతీయ సగటు 85%
  • రెండో డోసు సగటు 47%
  • వీరికి వెంటనే టీకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం హితవు
హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కవరేజీ తక్కువగా ఉండడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా రెండో డోసు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని తెలిపింది. ఈ వర్గాలకు రెండో డోసు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

ఈరోజు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో జరిపిన సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. హెల్త్‌కేర్‌ వర్కర్లతో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు కవరేజీ జాతీయ సగటు 82 శాతం ఉండగా.. రెండో డోసు కవరేజీ మాత్రం 56 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.

పంజాబ్‌, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు సహా మొత్తం 18 రాష్ట్రాల్లో హెల్త్‌కేర్ వర్కర్ల రెండో డోసు కవరేజీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల విషయానికి వస్తే తొలి డోసు జాతీయ సగటు 85 శాతంగా, రెండో డోసు సగటు 47 శాతంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల రెండో డోసు కవరేజీ సగటు తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ వర్గాలకు టీకాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమైన అంశమని.. ఆ దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. అవసరమైతే వారి కోసం ప్రత్యేకంగా టైమ్‌ స్లాట్‌లు ఉంచాలని సూచించారు.


More Telugu News