పన్నులు ఎగ్గొట్టిన వారెన్​ బఫెట్​, జెఫ్​ బెజోస్​, ఎలాన్​ మస్క్​!

  • 0.1 శాతమే పన్ను కట్టిన వారెన్ బఫెట్
  • ప్రోపబ్లికా అనే వార్తా సంస్థ సంచలన కథనం
  • ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ రికార్డులు బయటకు
  • రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడంపై ఐఆర్ఎస్ మండిపాటు
  • డేటా లీక్ చేసిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరిక
వాళ్లంతా మామూలు ధనవంతులు కాదు.. ప్రపంచ కుబేరులు. సెకను సెకనుకు సంపదను పెంచుకుంటూనే ఉన్నారు. అలాంటి కుబేరులే అమెరికాకు భారీగా పన్నులు ఎగవేశారు. అవును, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) రికార్డుల ప్రకారం.. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, బ్లూమ్ బర్గ్ వ్యవస్థాపకుడు మైకేల్ బ్లూమ్ బర్గ్, ఇన్వెస్టర్లు కార్ల్ ఇచాన్, జార్జ్ సోరోస్, వారెన్ బఫెట్ వంటి వాళ్లు కొన్ని కోట్లు ఎగ్గొట్టారని ప్రో పబ్లికా అనే వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

2007, 2011లలో బెజోస్, 2018లో మస్క్ లు పన్ను ఎగ్గొట్టారని పేర్కొంది. ఇటు వారెన్ బఫెట్ కూడా 2014 నుంచి 2018 మధ్య 2,430 కోట్ల డాలర్ల సంపదను మూటగట్టుకున్నా.. కేవలం 2.37 కోట్ల డాలర్ల పన్నులే కట్టారని ఆరోపించింది. ఆయన సంపాదించిన దాంట్లో కట్టిన పన్ను కేవలం 0.1 శాతమేనని తెలిపింది.

దీనిపై ఐఆర్ఎస్ కమిషనర్ చార్లెస్ రెట్టింగ్ స్పందించారు. సెనేట్ ఫైనాన్స్ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. ఆరోపణలపై నిజానిజాలను నిగ్గుతేలుస్తామన్నారు. అంతేగాకుండా రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటకు లీక్ చేసే విషయంపైనా దర్యాప్తు చేస్తామన్నారు. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని లీక్ చేసిన వారు జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.

మహమ్మారి సమయంలో సంపదను అపారంగా పెంచుకున్న వ్యక్తులు.. పన్నులు మాత్రం కట్టడం లేదని సెనేట్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రాన్ వైడెన్ అన్నారు. పన్ను కట్టే వారి సమాచారన్ని భద్రంగా ఉంచడం ఐఆర్ఎస్ విధి అని, అనధికారికంగా ఆ వివరాలు బయటపడడం చాలా పెద్ద నేరమని అన్నారు. ఆ వివరాలను వెల్లడించిన వారిపై దర్యాప్తు చేయించాలన్నారు.


More Telugu News