బెంగాల్‌లో అదృశ్యమై వంద కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ చేరుకున్న పులి

  • నాలుగైదు నదులు, మూడు దీవులను దాటేసిన వ్యాఘ్ర రాజం
  • గతేడాది అది అక్కడి నుంచే బెంగాల్ వచ్చి ఉంటుందంటున్న అధికారులు
  • పులి ఆచూకీ చెప్పిన రేడియో ట్యాగింగ్ పరికరం
పశ్చిమ బెంగాల్‌లో అదృశ్యమైన ఓ పులి కొండలు, కోనలు దాటుకుంటూ నాలుగు నెలలపాటు వంద కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ చేరుకుంది. పులి తన ప్రయాణంలో నాలుగైదు నదులు, మూడు దీవులను దాటేయడం విశేషం. అది తన ప్రయాణంలో ఎక్కడా జనావాసాల్లో చొరబడకపోవడం గమనార్హం.

బెంగాల్ అడవుల నుంచి అదృశ్యమైన ఈ పులి ఆచూకీని దాని మెడకు అమర్చిన రేడియో ట్యాగింగ్ పరికరం ద్వారా అటవీ అధికారులు కనుగొన్నారు. సుందర్బన్ అడవుల్లో కనిపించిన ఈ పులికి గతేడాదే ఈ పరికరాన్ని అమర్చారు. ఇప్పుడు అదే దాని ఆచూకీని తెలిపింది. అలాగే, ఒకవేళ ఆ పులి కనుక మరణిస్తే ఆ విషయాన్ని తెలియజేసేందుకు కూడా ఓ సెన్సార్‌ను అమర్చారు.

బెంగాల్ అడవుల నుంచి బయలుదేరిన ఈ పులి బంగ్లాదేశ్‌వైపుగా వెళ్తూ గత నెల 11న ఆ దేశంలోని తల్‌పాట్టి దీవికి చేరుకుంది. ఆ తర్వాత రేడియో ట్యాగింగ్ పరికరం పనిచేయడం మానేసింది. దీంతో దాని ఆచూకీ కనుగొనడం కష్టమైంది. తాజాగా, ఆ పులి బంగ్లాదేశ్‌లోని సుందర్బన్ అడవుల్లో ఉన్నట్టు గుర్తించారు. గతంలో అది అక్కడి నుంచే పశ్చిమ బెంగాల్ అడవుల్లోకి వచ్చి ఉంటుందని, ఇప్పుడు మళ్లీ అది సొంత ప్రాంతానికి చేరుకుని ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.


More Telugu News