తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు!

  • జూన్‌ 10 నుంచి అమల్లోకి
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు
  • తర్వాత గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు
  • సాయంత్రం 5 నుంచి తర్వాతి రోజు 6 గంటల వరకు లాక్‌డౌన్‌
  • కరోనా పూర్తిగా అదుపులోకి రాని ప్రాంతాల్లో యథాతథ స్థితి
తెలంగాణలో లాక్‌డౌన్‌ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.  సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కూడా కల్పించాలని నిర్ణయించారు.

సాయంత్రం 5 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్‌డౌన్‌ యథాతథంగానే కొనసాగించనున్నారు.

మూడో విడత లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో గంటసేపు ఇళ్లకు చేరుకునేందుకు అనుమతి ఇచ్చారు. గత నెల 31 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రేపటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనలను నిర్ణయించారు.


More Telugu News