ఎంతో ఖర్చు పెట్టి చైనా టీకా వేయించుకున్నా.. భారత వ్యాపారులను రానివ్వని డ్రాగన్​ దేశం

  • చైనాలో వ్యాపారం చేస్తున్న భారతీయులు
  • కరోనా నేపథ్యంలో భారత్ లో చిక్కుబడిన వ్యాపారులు
  • అక్కడికెళ్లాలంటే చైనా టీకా తప్పనిసరన్న నిబంధన
  • దుబాయ్, నేపాల్, మాల్దీవ్స్ లో వేయించుకున్న వైనం
  • అయినా వీసాలివ్వని చైనా రాయబార కార్యాలయం
భారతీయులు సహా చాలా దేశాలకు చెందిన వారు చైనాలో వ్యాపారాలు చేస్తున్నారు. వారంతా కరోనా నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లారు. తిరిగి అక్కడికెళ్లి వ్యాపారం చేసుకుందామంటే తమ టీకాలు వేసుకున్న వారినే రానిస్తామంటూ మార్చి 15న చైనా తిరకాసు పెట్టింది. కొన్ని దేశాల్లోనే అది అందుబాటులో ఉండడంతో చాలా మంది ఆయా దేశాలకు వెళ్లి మరీ టీకాలు తీసుకున్నారు. అయినా కూడా వారికి చైనా వీసాలివ్వట్లేదు.

దీంతో ‘మీ టీకాలే తీసుకున్నాం.. మమ్నల్ని రానివ్వండి’ అంటూ 300 మందికి పైగా భారతీయులు చైనాకు విజ్ఞప్తి చేస్తున్నారు. మన దేశంలో చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో వారంతా దుబాయ్, నేపాల్, మాల్దీవ్స్ వంటి దేశాలకు వెళ్లి చైనా టీకాలు వేయించుకున్నారు. ఇందుకోసం ఎంతో ఖర్చు పెట్టుకున్నారు. అయినా కూడా చైనా రాయబార కార్యాలయం మాత్రం వారికి వీసాలివ్వట్లేదు.

దీంతో ఈ నెల మొదట్లో 202 మంది వ్యాపారవేత్తలు ఈ విషయంపై భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ కు విజ్ఞప్తి చేశారు. చైనా రాజధాని బీజింగ్ లోని భారత ఎంబసీకి కూడా ఆ లేఖను పంపారు. తమను వీలైనంత త్వరగా చైనాకు తీసుకెళ్లాలని, కరోనా పరీక్షలతో పాటు కఠినమైన క్వారంటైన్ కూ సిద్ధంగానే ఉన్నామని అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.. భారత్ లోని రాయబార కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


More Telugu News