తెలంగాణ‌లో వైఎస్ షర్మిల పార్టీ పేరు అధికారికంగా ప్ర‌క‌ట‌న‌.. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి!

  • వైఎస్సార్ తెలంగాణ పార్టీగా పేరు ఖ‌రారు
  • అధికారికంగా ప్ర‌క‌టించిన పార్టీ నేత‌ రాజ‌గోపాల్
  • తన‌కు అభ్యంత‌రం లేద‌ని ఎన్నికల‌ సంఘానికి విజ‌య‌మ్మ లేఖ
  • జులై 8న పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మం
తెలంగాణలో పార్టీ పెడ‌తాన‌ని, రాజ‌న్న రాజ్యం తీసుకొస్తాన‌ని వైఎస్ షర్మిల ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఆమె పెట్ట‌బోయే పార్టీ పేరు, పార్టీ విధి విధానాల‌పై ఇప్ప‌టికే అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. ఆమె పార్టీ పేరు ‘వైఎస్సార్ టీపీ’ అని, జులై 8న ఆమె ప్ర‌క‌టిస్తార‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు ఆ ప్ర‌చార‌మే నిజ‌మైంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా త‌మ పార్టీ పేరును ష‌ర్మిల రిజిస్ట్రేష‌న్ చేయించారు.

ఈ ప్ర‌క్రియ నేటితో ముగిసిన‌ట్లు అధికారికంగా ప్ర‌కట‌‌న వ‌చ్చింది. ఆ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త రాజ‌గోపాల్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ... పార్టీ పేరుపై తన‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఎన్నికల‌ సంఘానికి వైఎస్ విజ‌య‌మ్మ లేఖ రాశార‌ని చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు.

వైఎస్సార్  సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్లీ తీసుకు వ‌స్తామ‌ని చెప్పుకొచ్చారు. రాజ‌న్న ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్న‌ట్లు చెప్పారు. ఇప్పటి వరకూ పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అధికారికంగా దీనిపై సంబంధిత ప‌త్రాలు త‌మ‌కు అందాక పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు  ప్రకటిస్తామ‌ని చెప్పారు.  పార్టీ ఆవిర్భావానికి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్ప‌టికే తాము ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించారు.


More Telugu News