మరో లాక్‌డౌన్‌ రాకూడదంటే.. కొవిడ్‌ నిబంధనల్ని పాటించండి: ఉద్ధవ్ థాకరే

  • మహారాష్ట్రలో ఐదంచెల అన్‌లాక్‌
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం పిలుపు
  • నిబంధనల్ని పాటిస్తూనే పరిశ్రమలు పనిచేయాలి
  • దేశానికే మహారాష్ట్ర ఆదర్శంగా నిలవాలి
  • సంక్షోభంలో తోడుగా నిలిచిన పరిశ్రమ వర్గాలకు కృతజ్ఞతలు
కరోనా కట్టడి నిమిత్తం విధించిన లాక్‌డౌన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా నివారణ నిబంధనల్ని కఠినంగా పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ప్రజలకు సూచించారు. మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల్ని సడలించలేదన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అక్కడి స్థానిక యంత్రాంగాలు నిర్ణయం తీసుకుంటాయన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో పరిశ్రమలు నిరంతరాయంగా పనిచేయాలని ఆకాంక్షించారు. తద్వారా యావత్‌ దేశానికి మహారాష్ట్రను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. ఆక్సిజన్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలో పరిశ్రమ వర్గాలు అండగా నిలిచాయని థాకరే ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే కీలక వైద్య సామగ్రిని అందించడంలోనూ ముందున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని కొవిడ్‌ తీవ్రతను బట్టి మొత్తం ఐదు అంచెల్లో లాక్‌డౌన్‌ను సడలించాలని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం స్థానిక యంత్రాంగాల్ని ఆదేశించిన విషయం తెలిసిందే.


More Telugu News