పిజ్జా హోం డెలివరీ చేయొచ్చుగానీ.. రేషన్​ చేయకూడదా?: అరవింద్​ కేజ్రీవాల్​

  • కేంద్రం అనుమతి అక్కర్లేదని కామెంట్
  • ఐదుసార్లు అనుమతి తీసుకున్నామన్న ఢిల్లీ సీఎం
  • పథకానికి ఒప్పుకొంటే ప్రధానికే క్రెడిట్ ఇస్తామని వ్యాఖ్య
  • రేషన్ మాఫియా రెచ్చిపోతోందని వెల్లడి
ఇంటికే రేషన్ సరుకులను డెలివరీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రేషన్ మాఫియా ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం దానిని నిలుపుదల చేసిందని ఆరోపించారు. పేద ప్రజల కోసం తెచ్చిన విప్లవాత్మక పథకం అమలు కాకుండా చేశారన్నారు.

‘‘రెండు రోజుల్లో అమలు చేయాల్సి ఉన్న ఇంటికే రేషన్ పథకాన్ని కేంద్రం ఆపేసింది. మహమ్మారి సమయంలో పిజ్జాను హోం డెలివరీ చేయగా లేనిది.. రేషన్ ను ఎందుకు చేయకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు. రేషన్ మాఫియా ఆటలు కట్టించేందుకు ఈ పథకం తెచ్చామని, కానీ, ఎంత శక్తిమంతం కాకపోతే వారు పథకాన్ని ఆపించేస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పథకం అమలు కోసం ఐదుసార్లు అనుమతి తీసుకున్నామని, కాబట్టి కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అయినా, గౌరవం కొద్దీ మరోసారి అనుమతి కోరామన్నారు. ఈ పథకం వల్ల 72 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరేదన్నారు.

పథకం అమలు చేయనివ్వాలని ప్రధానిని కేజ్రీవాల్ కోరారు. అనుమతినిస్తే పథకం గొప్పదనమంతా ప్రధానికే ఇస్తామన్నారు. రేషన్ పథకం ఆప్ కో లేదంటే బీజేపీకో సొంతం కాదన్నారు. కాబట్టి చేతులు జోడించి వేడుకుంటున్నానని, పథకానికి అనుమతినివ్వాలని కోరారు.


More Telugu News